విశాఖపట్నం జిల్లా తాండవ జలాశయం నీటిమట్టం ఆశాజనకంగా ఉంది. ఈ మేరకు ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి అధికారులు నీటి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఆగస్టు నెల 5న ఖరీఫ్ సీజన్‌కు నీటిని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని జల వనరుల శాఖ అధికారులు ప్రకటించారు. విశాఖ జిల్లా నాతవరం మండలం తాండవ జలాశయం కింద విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన సుమారు 52 వేల ఎకరాలు సాగవుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 380 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 376 అడుగుల వద్ద నిలకడగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఖరీఫ్ సీజన్‌కు నీటిని విడుదల చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఈ విషయాన్ని స్థానిక శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ దృష్టికి తీసుకెళ్తామని జలవనరుల శాఖ డిఈ రాజేంద్ర కుమార్ తెలిపారు.
వరినాట్లకు సిద్దమౌతున్న రైతులు