IAS Officers Scam: దాకవరపు రాములకు రాజకీయ బాధితుడి విభాగం కింద 1978లో కొమ్మాదిలోని సర్వే నంబరు 28/2 లో రాష్ట్ర ప్రభుత్వం 10.18 ఎకరాల భూమి కేటాయించింది. ఆ భూమి అమ్మకానికి ఎన్ఓసీ ఇవ్వాలని రాములు కుమారుడు శంకర్రావు దరఖాస్తు చేసుకోగా.. 2012 ఆగస్టు 28న ఎన్ఓసీ ఇచ్చేశారు. విశాఖ కలెక్టర్‌గా లవ్ అగర్వాల్‌కు.. అదే చివరి పని దినం కాగా ఆగస్టు 23న ఆర్డీవోను పిలిపించి అదే రోజు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అప్పటి జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ద్వారా 28వ తేదీన నివేదిక చేరగా.. నిషేధిత భూముల జాబితా నుంచి సదరు భూమిని తొలగిస్తూ.. ఉత్తర్వులిచ్చారు. వాస్తవానికి 2005 వరకూ రాములు పేరుతో ఎలాంటి అసైన్డ్ భూమీ కేటాయించలేదు. ఎన్ఓసీ జారీపై నిషేధం ఉన్నా.. లవ్ అగర్వాల్ తన చివరి పనిదినం రోజున అనుమతి జారీ చేశారు. ఈ లావాదేవీల ద్వారా చివరికి నిజామాబాద్ మాజీ ఎంపీ గంగారెడ్డి కుమారుడైన జి. శ్రీనివాసరెడ్డి లబ్ధి పొందారని సిట్ తేల్చింది. ఇదంతా పథకం ప్రకారం సాగిందని సిట్ పేర్కొంది.
ఇక కాపులుప్పాడలోని సర్వే నెంబర్ 248/2లో రాగతి అచ్చెన్నకు మాజీ సైనికోద్యోగుల కోటాలో కేటాయించిన మూడున్నర ఎకరాలు అమ్ముకునేందుకు అనుమతివ్వాలంటూ ఆయన భార్య రాగతి ఎల్లాయమ్మ 2005లో కలెక్టర్‌కు దరఖాస్తు చేశారు. ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల్లో కనీసం ప్రాథమిక పరిశీలన కూడా చేయలేదు. రెవెన్యూ రికార్డుల పరంగా చూస్తే అవి నకిలీ పట్టాలనితెలుస్తున్నా ప్రవీణ్ కుమార్, లవ్ అగర్వాల్ పరిశీలన చేయకుండా ఎన్ఓసీ జారీ చేశారు. ఆ సమయంలో భూముల విక్రయానికి సంబంధించి నిరభ్యంతర పత్రాల జారీ చేయడంపై నిషేధం అమల్లో ఉన్నట్లు సిట్ గుర్తించింది. ఈ వ్యవహారంలో లవ్ అగర్వాల్, ప్రవీణ్‌కుమార్‌పై ప్రభుత్వం తగిన రీతిలో చర్యలు తీసుకోవాలని సిట్ సిఫార్సు చేసింది.
విజయనగరం జిల్లా తెల్లాం మండలానికి చెందిన బత్తుల గోపాల్‌కు బక్కన్నపాలెంలో 43/2 సర్వే నెంబర్లో కేటాయించిన 4.88 ఎకరాల అసైన్డ్ భూమి అమ్ముకునేందుకు లవ్ అగర్వాల్ ఎన్ఓసీ జారీ చేశారు. కలెక్టర్ ఎన్ఓసీ ఇచ్చిన రోజే ఆ భూముల్ని నిషేధిత జాబితా నుంచి తొలగించారు. ఇదంతా అనుమానాస్పదంగా ఉందని సిట్ పేర్కొంది. వీఆర్ ప్రాజెక్ట్స్ మేనేజింగ్ పార్టనర్ ఎన్.శంకర్రావు సదరు భూమి కొనుగోలుకు 2005లోనే గోపాల్ కుటుంబ సభ్యులకు 10 లక్షలు రూపాయలు అడ్వాన్సు ఇచ్చి వారి వద్ద పత్రాలు తీసుకున్నారు. ఆ తర్వాత శంకర్రావు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై గోపాల్ భార్య ఆదిలక్ష్మి పేరిట నకిలీ పాస్‌పుస్తకం సృష్టించి.. రెవెన్యూ రికార్డుల్లో చేర్పించారు. అలా ఆదిలక్ష్మి పేరుకు మారిన ఆ భూమిని.. అమ్ముకునేందుకు లవ్ అగర్వాల్ ఎన్ఓసీ ఇచ్చేశారు. భూములు అమ్ముకునేందుకు, అవకాశం కల్పించే దస్త్రాన్ని లవ్ అగర్వాల్, గిరిజా శంకర్ 6 వారాల్లోనే పరిష్కరించారని సిట్ గుర్తించింది. వీరిద్దరి పాత్రను ప్రభుత్వం పరిశీలించాలని పేర్కొంది. అయితే తహసీల్దార్, ఆర్డీవోలు ఇచ్చిన నివేదికలు పరిశీలించాకే ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు అంగీకరించామని.. ఎలాంటి అత్యుత్సాహంగానీ, అలసత్వంగానీ లేదని లవ్ అగర్వాల్, ప్రవీణ్ కుమార్ సిట్‌కు వివరణ ఇచ్చుకున్నారు. సిట్ మాత్రం.. లవ్ అగర్వాల్, ప్రవీణ్ కుమార్ సహా రెవెన్యూ అధికారులు కుట్రపూరితంగా వ్యవహరించి.. విలువైన ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం అయ్యేందుకు సహకరించారని.. వారిపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది.
విశాఖ భూ అక్రమాల్లో మరో పాత్రధారుడు ఐఏఎస్ ఎస్.సత్యనారాయణ. 2005 జులై 22 నుంచి 2008 మే 21 వరకూ.. విశాఖ జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేసిన ఆయన ఆ సమయంలోనే కొన్నాళ్ల పాటు ఇంఛార్జ్ జాయింట్ కలెక్టర్‌గానూ పనిచేశారు. ప్రస్తుతం ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీగా ఉన్నారు. నిబంధనల ప్రకారం కలెక్టర్లకు మాత్రమే.. భూముల అమ్మకానికి ఎన్ఓసీ ఇచ్చే అధికారం ఉంటుంది. కానీ, సత్యనారాయణ ఇంఛార్జ్ జేసీ హోదాలో మంజూరు చేశారు. పరవాడ మండలం దేశపాత్రునిపాలెంలో.. 11 మంది విశ్రాంత సైనికోద్యోగుల పేరిట వివిధ సర్వే నెంబర్లలో కేటాయించిన 34.56 ఎకరాల భూమిలో అత్యధిక భాగాన్ని విక్రయించేందుకు వీలుగా సత్యనారాయణ..ఏకంగా 9 ఎన్ఓసీలు జారీ చేశారు. సదరు భూములన్నీ చివరికి చేతులు మారి.. ధర్మాన బంధుగణం, మిత్ర బృందం చేతుల్లోకి వెళ్లిపోయాయి. ధర్మాన ప్రసాదరావు సోదరుడు ధర్మాన రామదాస్, సన్నిహితుడు ఐబీ కుమార్ డైరెక్టర్లుగా ఉన్న.. ఓంకాన్ రియల్టర్స్, కోరమాండల్ ఎస్టేట్స్ అండ్ ప్రాపర్టీస్ సంస్థలు ఈ ఎన్ఓసీల ద్వారా అంతిమ లబ్ధి పొందాయి. ఈ వ్యవహారం అంతా ఒక కుట్ర ప్రకారం జరిగిందని సిట్ తేల్చింది. రిజిస్టర్ ఫైళ్లు అందుబాటులో లేకపోయినా.. పరవాడ తహసీల్దారు, విశాఖ ఆర్డీఓ కళ్లు మూసుకుని క్లియరెన్స్ ఇచ్చేశారని సిట్ గుర్తించింది. అయితే ఇంఛార్జ్ జేసీగా ఉండి ఎన్ఓసీ ఎలా ఇచ్చారని సత్యనారాయణను సిట్ ప్రశ్నించింది. ఆ అధికారం ఇంఛార్జ్ జేసీగా ఉన్న రెవెన్యూ అధికారికి ఉందా లేదా అనేది నిబంధనల్లో ఎక్కడా నిర్వచించలేదని సత్య నారాయణ సమాధానం ఇచ్చారు. 1968 నాటి జాబ్‌చార్ట్ ప్రకారం భూములకు సంబంధించిన వ్యవహారాలన్నీ జేసీ పరిధిలోకి వస్తాయని, కాబట్టి అలాంటి దస్త్రాలేవీ తనకు పంపించాల్సిన అవసరం లేదని కలెక్టర్ చెప్పినందునే.. ఇంఛార్జ్ జేసీ హోదాలో తాను ఎన్ఓసీ లు ఇచ్చానని సత్యనారాయణ సిట్‌కు మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. రెండు సమాధానాలూ పరస్పర విరుద్ధంగా ఉన్నాయని సిట్ పేర్కొంది.
చట్టాన్ని పక్కనపెట్టి ధర్మాన చెప్పినట్లు చేసుకుంటూ పోయిన మరో ఐఏఎస్ జె.శ్యామలరావు. 2009 జూన్ 18 నుంచి 2011 జూన్ 17 వరకూ విశాఖ కలెక్టర్‌గా పనిచేశారాయన. ప్రస్తుతం ఉన్నతవిద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. మాజీ సైనికోద్యోగుల పేరిట ఉన్న డీ ఫామ్ పట్టాల భూమి అమ్ముకునేందుకు.. నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత జాబితా నుంచి తొలగించారు. ఆ భూముల్లో ఎక్కువ భాగం.. అప్పటి, ఇప్పటి రెవెన్యూమంత్రి ధర్మాన ప్రసాదరావు, ఆయన సోదరుడు, సన్నిహితుల చేతుల్లోకి వెళ్లినట్లు సిట్ తేల్చింది. పరవాడ మండలం పెదముషిడివాడలో మాజీ సైనికోద్యోగుల కోటాలో 437/1 సర్వే నెంబర్లో సింహచలం పేరిట ఉన్న 5.14 ఎకరాలు, సన్యాసిరావు పేరిట సర్వే నెంబర్ 441/1లో ఉన్న 4.65 ఎకరాలు, సత్యాడ అప్పారావు పేరిట.. సర్వే నెంబర్ 437/2లో ఉన్న 3.95 ఎకరాల విక్రయానికి నిబంధనలకు విరుద్ధంగా అనుమతిచ్చారు. ఈ భూములను తొలుత ధర్మాన ప్రసాదరావు సన్నిహితుడైన ఐబీ కుమార్ భార్య, కోరమాండల్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి జి.ప్రసన్న కొనుగోలు చేయగా.. ఆ తర్వాత అందులో కొంత భూమిని ధర్మాన ప్రసాదరావు స్నేహితులు గోవింద సత్యసాయి, జాస్తి భాస్కరరావు, మరో బంధువు కొన్నారు. వీటికి సంబంధించిన దరఖాస్తు రిజిస్టర్ దొరకలేదు. అసైన్‌మెంట్ రిజిస్టర్‌లో.. అనేక లోపాలున్నా అమ్మకానికి అనుమతిచ్చేశారు. అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రమేయమే దీనికి ప్రధాన కారణం.