పర్యాటకుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) ఆధ్వర్యంలో ఈనెల 28 నుంచి డిసెంబరు 8 వరకు పిలిగ్రీమేజ్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ నడపనుంది. ఐఆర్సీటీసీ దక్షిణ మధ్య జోన్ ఏరియా అధికారి చంద్రమోహన్.. యాత్రకు సంబంధించిన వివరాలను విశాఖలో తెలిపారు. ఈనెల 28న ఈ టూరిస్ట్ ట్రైన్ విజయవాడలో బయలుదేరి విశాఖ మీదుగా వెళ్తుందని వెల్లడించారు. వైబ్రెంట్ గుజరాత్ పేరిట పదకొండు రోజుల పాటు ఈ యాత్ర ఉంటుందని ఆయన పేర్కొన్నారు. గతంలో కూడా యాత్రికులకు అందుబాటు ధరలో పలు ప్యాకేజీలతో పలు ప్రత్యేక రైళ్లను నడిపామన్నారు.
వైబ్రెంట్ గుజరాత్ ప్యాకేజీలో సోమనాథ్, ద్వారక, బెట్ ద్వారక, అక్షర్ ధామ్, అహ్మదాబాద్ స్టాట్యూ ఆఫ్ యూనిటీ తదితర ప్రాంతాలను ప్రయాణికులు సందర్శించవచ్చని చంద్రమోహన్ తెలిపారు. ఉత్తరాంధ్ర వాసులకు అందుబాటులో ఉండేవిధంగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పలాసలో రైలు హాల్ట్ ఏర్పాటు చేశామని తెలిపారు. స్లీపర్ క్లాస్ రూ. 10,400, థర్డ్ ఏసీ రూ.17,330 ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయన్నారు. యాత్రికులకు బోర్డింగ్ ఫుడ్, స్నాక్స్, ట్రావెలింగ్ ప్యాకేజీలో లభిస్తాయని చెప్పారు. ఈ అవకాశాన్ని యాత్రికులు వినియోగించుకోవాలని, పూర్తి వివరాలకు 82879 32318, 82879 32281 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.