ఆర్ఆర్ వెంకటాపురం బాధితుల కన్నీటి వెతలు తిందామంటే ఒంటబట్టదు..!పడుకుంటే నిదరరాదు..!కళ్లు తెరిస్తే గత జ్ఞాపకాలు..!కళ్లు మూస్తే స్టైరిన్ పీడకలలు.. !కోటి రూపాయల చెక్కు చేతికందినా కళ్లలో ఉబికివస్తున్న కన్నీళ్లు ఆగడంలేదు!గుండెల్లో మంటలు చల్లారడంలేదు..!ఎవర్ని కదిలించినా భవిష్యత్తుపై సందేహాలే.!ఎల్జీ పాలిమర్స్ అక్కడున్నంత వరకూ..ప్రభుత్వం ఇచ్చే కోటి రూపాయలు తమకు పాతజీవితాన్ని తెచ్చివ్వగలవా అనే ప్రశ్నలే.!?
విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో విషవాయువు లీకై రోజులు గడుస్తున్నా...స్టైరిన్ కల్లోలం నుంచి బాధిత కుటుంబాలు తేరుకోలేకపోతున్నాయి.ఎవర్నికదిపినా..గుండెల్లో గూడుకట్టుకున్న ఆవేదన కన్నీళ్ల రూపంలో ఉబికివస్తోంది.కంటిపాపను కోల్పోయిన తల్లి,..భర్తను కోల్పోయిన భార్య.. ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో విషాద గాధ..!
కింగ్‌జార్జ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు..ప్రమాదంలో కోల్పోయిన కుటుంబ సభ్యుల్ని తలచుకుని..గుండెలవిసేలా రోదించడం అందరినీ కంటతడిపెట్టిస్తోంది.చివరకు కోటి రూపాయల పరిహారం చెక్కు అందుకునే సమయంలోనూ..వారికళ్లలో కొంచెమైనా ఆనందం కనిపించలేదు...
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్టైరిన్ బాధితులంతా..దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు గురించే బెంగపడుతున్నారు.ఎల్జీ పరిశ్రమను అక్కణ్నుంచి తరలించి..విషవాయువు ప్రభావిత గ్రామాల్లో అందరికీ జీవితకాల వైద్య బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌చేస్తున్నారు.కోటి రూపాయల పరిహారం అందిస్తే తమకు న్యాయం జరిగినట్లు కాదనీ, ఇంతటి విషాదానికి కారణమైన పరిశ్రమను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ ఆప్తులను పొట్టనపెట్టుకున్న ఆ పరిశ్రమను తరలించేంత వరకు పోరాటం చేస్తామంటున్నారు. గ్రామాల్లో పరిస్థితి చక్కబడి....తాము సాధారణ జీవనం గడిపే వరకూ ప్రభుత్వం అండగా నిలవాలని బాధితులు కోరుతున్నారు.
ఇదీ చదవండి:'విశాఖ గ్యాస్ లీకేజీ పరిసర ప్రాంతాల్లో రాత్రి బస'