Industries Left Due to The Harassment Of The YCP Leaders: కొత్తగా అధికారంలోకి వచ్చిన వారు..ఆదాయ మార్గాలను పెంచుకుని..రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రచిస్తారు. కానీ సీఎం జగన్ రూటే వేరు..కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయకపోగా..ఉన్న వాటిని రాష్ట్రం నుంచి తరిమేశారు. అధికారంలోకి రాగానే రాజధాని అమరావతి పనులు ఆపేశారు. రాజధానిలో స్టార్టప్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్న సింగపూర్ కన్సార్షియంని తరిమికొట్టారు. విశాఖలో లులూకి పొగబెట్టారు.. అదానీని బెదరగొట్టారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్‌ని పో పొమ్మని పంపేశారు. శ్రీసత్యసాయి జిల్లాలో కియాపై కన్నెర్ర చేశారు. జాకీని మూడు చెరువుల నీళ్లు తాగించారు. చివరకు రిలయన్స్‌నీ వెళ్లగొట్టారు. ఇక్కడి పరిస్థితులకు భయపడి కొన్ని పరిశ్రమలు వెళ్లిపోతుంటే..అధికార పార్టీ ప్రజాప్రతినిధుల దాష్టీకాలను తట్టుకోలేక మరికొన్ని పరిశ్రమలు పారిపోతున్నాయి.
వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే అదానీకి ఝలక్ ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో విశాఖలో 70వేల కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖలో మూడు చోట్ల 400 ఎకరాల్ని కేటాయించగా..20 ఏళ్లలో పెట్టుబడి పెడితే, ఇప్పుడు భూములివ్వడమేంటని వైసీపీ ప్రభుత్వం కుదరదు పొమ్మంది. దాంతో అదానీ సంస్థ 70 వేలకోట్ల ప్రతిపాదన విరమించుకుని 3వేల కోట్లు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
విశాఖలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు 2వేల 200 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు యూఏఈ సంస్థ లులూ ముందుకు వచ్చింది. విశాఖ బీచ్‌రోడ్డులో దీనికి 13.83 ఎకరాల్ని గత ప్రభుత్వం కేటాయించగా..వైసీపీ ప్రభుత్వం రద్దుచేసింది. ప్రభుత్వ వేధింపులు తాళలేక లులూ సంస్థ తమిళనాడుకు తరలిపోయింది. అక్కడ 3వేల 500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒకటైన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ విశాఖలో టెక్నాలజీ డెవలప్‌మెంట్ క్యాంపస్‌కు ముందుకొచ్చింది. 2,500 మందికి అత్యున్నతస్థాయి ఐటీ ఉద్యోగాలు కల్పించడమే గాక..70 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెడతామని ఒప్పందం కుదుర్చుకుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిందే తడవు..ఆ సంస్థకూ పొగబెట్టింది..