భారత్ - రష్యా సంయుక్త నౌకావిన్యాసాలకు ఈసారి రష్యా వేదికైంది. గతంలో బంగాళాఖాతంలో నిర్వహించిన ఈ విన్యాసాలు ఈసారి అక్కడి సెయింట్ పీటర్స్ బర్గ్ లో జరిగాయి. భారత్ నౌక ఐఎన్ఎస్ తబార్ అక్కడి 325 నేవీడేలో పాల్గొంది. రష్యాలో భారత అంబాసిడర్ డీబీ వెంకటేష్ వర్మ.. నౌకను సందర్శించారు. రష్యా డిప్యూటీ నౌకా కమాండర్ వైస్ అడ్మిరల్ సెర్గయ్ ఎల్సెవ్ నౌకను సందర్శించారు.
తబార్ నౌక కెప్టెన్ మహేష్ మంగిపూడి భారత్ బృందానికి నేతృత్వం వహించారు. రష్యా నేవీ డే సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ పరేడ్‌ను సమీక్షించారు. ఇందులో 50 నౌకలు, సబ్ మెరైన్లు, మోటార్ బోట్లు 48 యుద్ద విమానాలు, హెలీకాప్టర్లు ఈ పరేడ్‌లో పాల్గొన్నాయి. భారత్, రష్యా ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేసే కార్యక్రమంలో భాగంగా ఇంద్ర నేవీ విన్యాసాలు ప్రతి రెండేళ్ల కొకసారి నిర్వహిస్తారు.
ఈ నేవీ డే పరేడ్ పూర్తయిన తర్వాత ఇంద్ర విన్యాసాలు జరిగాయి. రెండు రోజుల పాటు బాల్టిక్ సీ లో భారత్ , రష్యా నౌకలు విన్యాసాలు నిర్వహించాయి. ఈరెండు దేశాలు ఈవిన్యాసాలు నిర్వహించడం ఇది 12 వసారి. 2003 నుంచి ఈ విన్యాసాలు నిర్వహిస్తూ వస్తున్నారు.
బహుముఖ మారిటైం ఆపరేషన్లను నిర్వహించడం ఇందులో ప్రధానాంశంగా ఉంది. రెండు రష్యా యుద్ద నౌకలు ఇంద్ర విన్యాసాల్లో పాల్గొన్నాయి. నౌకల మీదనుంచి ఆయుధాల ప్రయోగాలు, హెలీకాప్టర్ల లాండింగ్‌లు క్షిపణులను మోసుకుపోవడం లక్ష్యాన్ని గురి చూసి కొట్టడంవంటి విన్యాసాలన్నీ నిర్వహించారు. సుదీర్ఘకాలంగా ఇరు దేశాల మధ్య స్నేహసంబంధాలకు పరస్పర సహకారానికి ప్రతీకగా ఈ విన్యాసాలు రెండేళ్ల కొకసారి నిర్వహిస్తూ వస్తున్నారు. ఈసారి కూడా విజయవంతంగా ఈ విన్యాసాలు పూర్తవడం పట్ల భారత నౌకాదళం సంతృప్తి వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి:వీఎంఆర్‌డీఏ బృహత్తర ప్రణాళికపై అభ్యంతరాలు.. మరింత సమయం కావాలంటున్న ప్రజలు