విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తున్న సమయంలో నగర పోలీస్ కమిషనరేట్ పరిధి పెంచే యోచన చేస్తోంది రాష్ట్ర పోలీస్ విభాగం. కొన్నిరోజుల క్రితం డీజీపీ విశాఖ పర్యటన సమయంలోనే ఈ అంశం చర్చకు వచ్చింది. ఇప్పడు ఆ దిశగా పోలీసు ఉన్నతాధికారులు సమాలోచన చేస్తున్నారు.
ప్రస్తుతం విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2 జోన్లు, 6 డివిజన్లు, 23 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఐజీ క్యాడర్ అధికారి కమిషనర్గా ఉన్నారు. వారికింద ముగ్గురు ఐపీఎస్ అధికారులు, డీసీపీలు ఉన్నారు. వారికింద 9 మంది ఏసీపీలు ఉన్నారు. ప్రస్తుతం పోలీస్ కమిషనరేట్ పరిధి మహానగరపాలక సంస్థ పరిధి వరకు ఉంది. మహానగరపాలక సంస్థ పరిధి విస్తరించారు.. కనుక ఇప్పుడు పోలీస్ కమిషనరేట్ పరిధి విస్తరించే ప్రణాళిక సిద్ధంచేశారు.
ఈ ప్రణాళిక ప్రకారం 72 మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లు 98 అవుతాయి. అది జరిగితే విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటు అనకాపల్లి, పరవాడ నుంచి అటు భీమిలి వరకు వస్తుంది. అప్పుడు అదనంగా మరో డీసీపీ, ఇద్దరు ఏసీపీలు వస్తారు. అనకాపల్లి పరిధిలో ఉన్న మరో 5 పోలీస్ స్టేషన్లు కమిషనరేట్ పరిధిలోకి వచ్చేలా ప్రణాళిక వేశారు. ఒకవేళ అనకాపల్లి జిల్లాగా రూపాంతరం చెందితే సమస్య రాకుండా ఆలోచన చేస్తున్నారు.