విశాఖ మన్యంలో తరచూ డోలీమోతలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. సరైన రహదారి, రవాణా సదుపాయాలు లేకపోవడంతో ప్రసూతి సమయం వరకూ ఇళ్ల వద్దే ఉండిపోతున్నారు. ఈ పరిస్థితి ఒక్కోసారి వారి ప్రాణాలమీదకూ తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో మన్యంలో డోలీమోతలు తప్పేలా ఐటీడీఏ చర్యలు చేపట్టింది. చింతపల్లి కేంద్రంగా గర్భిణుల కోసం గతంలో నిర్మించిన సామాజిక భవనాన్ని గర్బిణుల వసతిగృహంగా మార్పులు చేసింది. ఈ వసతి గృహాన్ని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి గోపాలకృష్ణ, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ప్రారంభించారు.
ఈ భవనంలో 10 బెడ్లు ఏర్పాటు చేశామని.. డెలివరీకి పక్షం రోజులుముందునుంచే మారుమూల ప్రాంతాలకు చెందిన గర్బిణులకు ఇక్కడ వైద్యసేవలు అందించనున్నట్టు అదనపు డీఎంహెచ్‌వో తెలిపారు. గర్భిణులకు పౌష్టికాహార కోసం ఒక్కరికి రోజుకి రూ.240 ప్రభుత్వం కేటాయించిందని.. ఈ అవకాశం వినియోగించుకోవాలని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కోరారు.