వీధి వ్యాపారులకు జగనన్న తోడు పథకం ద్వారా త్వరలోనే బ్యాంకు ఖాతాలకు డబ్బు జమ కానుంది. విశాఖ జిల్లా నర్సీపట్నం పురపాలక పరిధిలో అదనంగా కొంతమందికి ఈ పథకాన్ని వర్తించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సిబ్బంది, వాలంటీర్లు బృందంగా ఏర్పడి అర్హులైన 560మంది చిరు వ్యాపారులను గుర్తించారు. వారి వివరాలు ఇటీవలే ఆన్లైన్లో నమోదు చేయడంతో వీరందరికీ ప్రభుత్వ సాయం మంజూరైందని అధికారులు తెలిపారు. రావాల్సిన మొత్తం ఈ నెల 24న బ్యాంకు ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
అదనంగా మరో వంద మందికి సాయం అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెప్పారు. నర్సీపట్నం పురపాలక సంఘం పరిధిలో పదిహేడు సచివాలయాలు ఉండగా ఒక్కో సచివాలయంలో కనీసం యాభై మందికి రుణాలు అందించే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించామని అన్నారు. అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చునని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మేనేజర్ లలిత పేర్కొన్నారు.