ఐఏఎస్ స్థాయికి మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు - జగన్నాటకంలో తమ వంతు పాత్ర పోషణ IAS Officers Favor to YSRCP Government: కొందరు ఐఏఎస్ అధికారుల ప్రభు భక్తి శ్రుతిమించుతోంది. ఆ భక్తి కోసం కోర్టు ధిక్కారాలకైనా సిద్ధపడుతున్నారుగానీ.. వృత్తి ధర్మం పాటించడంలేదు. రుషికొండపై ప్రభుత్వ పెద్దల ఉల్లంఘనలకు వంతపాడారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినా, కోర్టుల్లో కేసులున్నా రుషికొండపై కట్టిన విలాస సౌధాలే.. ముఖ్యమంత్రి కార్యాలయాలకు అనుకూలమంటూ నివేదిక ఇవ్వడం నివ్వెరపరుస్తోంది.
రుషికొండకు గుండుకొట్టి ప్రభుత్వం నిర్మించిన కట్టడాన్ని.. ప్రభుత్వం పర్యాటక భవనాలని మొదట్లో బుకాయించినా.. ఇటీవలే అది సీఎంఓ కార్యాలయం అంటూ ముసుగు తొలిగించింది. అయితే ఈ నిర్మాణంలో అడుగడుగునా ఉల్లంఘనలే కనిపిస్తున్నాయి. అక్కడ పర్యావణానికి తూట్లూ పొడిచారు. సీఆర్‌జెడ్ నిబంధనల్ని తుంగలో తొక్కారు.
రుషికొండ నిర్మాణాలపై సుప్రీంకోర్టులో విచారణ - హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్‌కు సూచన
అసలు అనుమతులు తీసుకుందే రిసార్ట్ పేరుతో. మరిదాన్ని సీఎంవో కార్యాలయంగా వాడొచ్చా. సాధారణ పౌరులలోనే ఇలాంటి ప్రశ్నలు మెదులుతుంటే. మన ఐఏఎస్‌లకు ఇంకెన్ని సందేహాలు రావాలి. కానీ, వాళ్లకు అవేమీ గుర్తు రాలేదు. రుషికొండపై నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు నిర్మించారని కోర్టులు నిగ్గుతేల్చినా అవే జగన్ నివాసానికి అనుకూలమని ముగ్గురు ఐఏఎస్‌లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.
వీరి అందించిన నివేదిక వల్ల.. అసలు వీళ్లు ఐఏఎస్లేనా అనే అనుమానం కలుగుతోంది. ప్రజల పట్ల నిబద్ధత, నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలన్న స్పృహ కోర్టు తీర్పులంటే కనీస గౌరవం ఉంటే.. ఉల్లంఘనలకు పచ్చజెండా ఊపుతారా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి.
దేశంలో అనేక అక్రమ కట్టడాలు నేలమట్టం అయ్యాయి, మరి రుషికొండ విషయంలో అదే జరిగితే ప్రజాధనం వృథాకు బాధ్యులెవరు?
కొచ్చి సమీపంలోని మరుడు రిసార్ట్స్‌లో.. రుషికొండ తరహాలోనే సీఆర్‌జడ్ నిబంధనలను ఉల్లంఘించి నిర్మించారు . మన తెలుగుతేజం, స్థానిక కలెక్టర్ కృష్ణతేజ వాటిని దగ్గరుండి కూల్చేయించారు. నిజాయతీకి నీరాజనాలందుకున్నారు. మరి మన ఐఏఎస్‌లకు ఏమైంది.. రుషికొండ భవనాలే సీఎంఓకు అనుకూలమని నివేదిక ఇచ్చిన ముగ్గూరు ఐఏఎస్‌లు జగన్నాటకంలో తమ వంతుపాత్ర పోషించారు.
సీఎంవో కోసమే కట్టుకున్న భవనాల్ని ఇప్పుడే కొత్తగా ఎంపిక చేసినట్లుగా నాటకాన్ని రక్తికట్టించారు. కమిటీలో ఒక సీనియర్ అధికారిణి.. జగన్ అక్రమాస్తుల కేసులో సహ నిందితురాలు. మరొకరు రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తూ ఎడాపెడా అప్పులు చేస్తున్న శాఖలోని కీలక అధికారి. ఇంకొకరు అధినేత చెప్పినదానికల్లా తలాడిస్తూ.. ఆయన మనసు చూరగొన్న అధికారి. మొత్తంగా నిబంధనలు గాలికొదిలేసి.. ప్రభు భక్తిని ప్రదర్శించడంలో ముగ్గురూ ముగ్గురే అనిపించుకున్నారు.
మూడు రాజధానులు కుదరవని.. అమరావతి నుంచి ఏ ప్రభుత్వ కార్యాలయాన్నీ తరలించేందుకు వీల్లేదని గతేడాది మార్చిలో హైకోర్టు విస్పష్ట తీర్పిచ్చింది. కోర్టు తీర్పును ధిక్కరించి ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం ముసుగులో యంత్రాంగాన్ని విశాఖకు ప్రభుత్వం ఎలా తరలిస్తారని ముగ్గురు ఐఏఎస్‌లు ఎందుకు నోరు మెదపలేదు. పైగా విశాఖలో పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంగల భవనాల్ని గుర్తించామని నివేదిక ఇవ్వడమేంటి. ఇది ముమ్మాటికీ కోర్టుల్ని ధిక్కరించడమేనని, భవిష్యత్తులో అధికారులే బాధ్యులవుతారని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
TDP Anitha On Rushikonda : జనం సొమ్ముతో జగన్ విలాసాలు.. విశాఖను దోచేందుకే రుషికొండపై మకాం: అనిత, సంధ్యారాణి