PM Modi tour in AP: ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ సభ కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు మూడు లక్షల మంది జనం బహిరంగ సభ హాజరవుతారనే అంచనాలతో అధికారులు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర బలగాలకు చెందిన దాదాపు పదివేల మంది సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు సిద్ధం చేస్తున్నారు.
విశాఖపట్నం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ.. సుమారు 15 వేల 233 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పాతపట్నం నుంచి నరసన్నపేట మధ్య రెండు లైన్ల రహదారిని ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. తూర్పు తీరంలో 2917 కోట్లతో అభివృద్ధి చేసిన ఓఎన్జీసీ యూ ఫీల్డ్, 385 కోట్ల రూపాయలతో గుంతకల్లులో ఐఓసీఎల్ చేపడుతున్న గ్రాస్ రూట్ డిపో నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. విజయవాడ-గుడివాడ-భీమవరం-నిడదవోలు రైల్వే లైన్, గుడివాడ-మచిలీపట్నం, భీమవరం-నర్సాపురం 221 కిలోమీటర్ల మార్గం తదితర అభివృద్ధి పనుల్ని వేదిక వద్ద నుంచే ప్రధాని ప్రారంభిస్తారు. 7 వేల 614 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ఈ పర్యటనలో మోదీ శంకుస్థాపన చేయనున్నారు.