ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రద్దుల పద్దులో వసతి గృహాలు! - governments hostel news in vishaka

గత ప్రభుత్వ హయాంలో మంజూరైన అభివృద్ధి పనుల రద్దు కొనసాగుతోంది. ఇప్పటికే పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఇతర శాఖల పరిధిలో సుమారు రూ.200 కోట్ల విలువైన రహదారి, తాగునీటి పనులను రద్దు చేశారు. తాజాగా సాంఘిక సంక్షేమశాఖ పరిధిలో కళాశాల వసతిగృహాల నిర్మాణ పనులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 60 కళాశాల పనులు రద్దుచేయగా అందులో జిల్లాకు చెందిన వసతిగృహాలు ఏడు ఉన్నాయి. దీంతో విద్యార్థుల వసతి సమస్య ఇప్పట్లో తీరేటట్లు కనిపించడం లేదు.

రద్దుల పద్దులో వసతి గృహాలు!
రద్దుల పద్దులో వసతి గృహాలు!

By

Published : Aug 13, 2020, 12:08 PM IST

విశాఖ జిల్లాలో సాంఘిక సంక్షేమ వసతిగృహాలు 55 ఉండగా అందులో కళాశాలలకు సంబంధించినవి 23 ఉన్నాయి. కళాశాల విద్యార్థులకు సంబంధించి ప్రత్యేక వసతి గృహాలు లేకపోవడంతో పదోతరగతి విద్యార్థులున్న వసతి గృహాల్లోనే కొన్ని గదులను వీరికి కేటాయించి నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల అద్దె భవనాలు తీసుకుని వసతి కల్పిస్తున్నారు. ప్రీ మెట్రిక్‌, పోస్టు మెట్రిక్‌ విద్యార్థులను ఒకేచోట ఉంచడం వల్ల వసతి సమస్యలు ఎదురవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో డిపార్ట్‌మెంటల్‌ అటాచ్‌డ్‌ హాస్టల్స్‌ (డీఏహెచ్‌) పేరుతో కళాశాల వసతిగృహాలకు సొంత భవనాలను మంజూరు చేసింది. ఒక్కో వసతి గృహానికి రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్ల చొప్పున ఎస్సీ ఉప ప్రణాళిక నిధులను కేటాయించింది. జిల్లాలో ఏడు వసతిగృహాలకు ముందుగా రూ.37 కోట్లు మంజూరు చేశారు. వైకాపా సర్కారు అధికారంలో వచ్చిన తరువాత జూన్‌లో మరోసారి వీటి అంచనా విలువలను పెంచి రూ.48.57 కోట్లతో కళాశాల నిర్మాణాలకు పరిపాలనా ఆమోదం ఇచ్చింది. ఇదే సర్కారు ఈ పనులను ఇప్పుడు రద్దు చేయడం విశేషం.

మొదటికొచ్చిన వసతి కష్టాలు

గత ప్రభుత్వం మంజూరు చేసిన పనుల్లో మొదలుకానివి, 25 శాతం కంటే తక్కువ పనులు జరిగిన వాటిపైనా వైకాపా సర్కారు సమీక్షిస్తోంది. అందులో భాగంగానే చాలావరకు పనులు రద్దు చేసింది. ఈ వసతిగృహాల నిర్మాణాలపైనా సమీక్షించింది. గత ప్రభుత్వం ఈ పనుల బాధ్యతను ఆంధ్రప్రదేశ్‌ వైద్యసేవలు, మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ)కు అప్పజెప్పిరది. అయితే వారికి తగినంత సిబ్బంది లేకపోవడం.. సాధారణ ఎన్నికల ముందర మంజూరు చేసిన పనులు కావడం, తరువాత అంచనా విలువలు మారడంతో వీటిని టెండర్ల దశను దాటించలేకపోయారు. మంజూరు దశలోనే మగ్గుతున్న ఈ పనులను తాజాగా రద్దు చేయడంతో విద్యార్థి వసతి కష్టాలు మళ్లీ మొదటికొచ్చినట్లయింది.

మరోసారి మంజూరు చేస్తారు

కళాశాల వసతిగృహాల నిర్మాణ పనులను రద్దు చేసినా మరోసారి ఇవే పనులను మంజూరు చేసే అవకాశం ఉంది. గతంలో ఏపీఎంఎస్‌ఐడీసీకి ఈ పనులు అప్పగించారు. వారు సకాలంలో వీటిని మొదలుపెట్టించలేకపోయారు. కొత్తగా మరికొన్ని పనులతో మంజూరుచేసి ఏపీఈడబ్ల్యూఐడీసీ వాళ్లకు అప్పగించనున్నారు. - రమణమూర్తి, జేడీ, సాంఘిక సంక్షేమశాఖ

ABOUT THE AUTHOR

...view details