విశాఖ జిల్లా గాజువాకలో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన బాలిక తల్లిదండ్రులకు హోంమంత్రి మేకతోటి సుచరిత ఆర్ధిక సాయం కింద 10లక్షల రూపాయల చెక్కును అందజేశారు. బాధితురాలి కుటుంబ సభ్యులకు పరామర్శించి ధైర్యం చెప్పారు. దిశ పూర్తిస్థాయి చట్టమైతే 21 రోజుల్లోనే శిక్షలు అమలు చేయగలమన్న ఆశాభావం వ్యక్తం చేసిన ఆమె ఇంకా రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉందన్నారు.
చట్టాలు ఎన్ని తెచ్చిన మహిళల భద్రత ప్రశ్నార్ధకంగా మారిందని హోంమంత్రి ఆవేదన చెందారు. ఈ సంఘటనపై 7 నుంచి 14 రోజుల్లో దర్యాప్తు, విచారణ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు హోం మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రితోపాటుగా జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, దిశ స్పెషల్ ఆఫీసర్ కృత్తికా శుక్లా, దీపికా పాటిల్, డీసీపీ ఐశ్వర్య రాస్తోగి, ఇతర పోలీస్ అధికారులు ఉన్నారు.