నక్సల్స్ సమస్య పరిష్కారానికి ఏం చేశారు?: హైకోర్టు - నక్సల్స్ సమస్య పరిష్కరించమంటూ రాష్ట్రానికి హైకోర్టు ఆదేశాలు
ఏపీ సివిల్ లిబర్టీస్ కమిటీ ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ వ్యాజ్యంపై ధర్మాసనం స్పందించింది. వెంటనే భవానీకి 24 గంటల్లో వైద్యం అందించి రక్షణ కల్పించాలని హోంశాఖను ఆదేశించింది. నక్సల్స్ సమస్య పరిష్కారం గురించి ఏమైనా సంప్రదింపులు జరిపారా ? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
విశాఖ మన్యం ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టులు అరుణ, భవానీ, గుమ్మిరేవుల గ్రామ మాజీ సర్పంచ్ నారాయణరావును కోర్టులో హాజరుపరచాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, జస్టిస్ జె . ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
గాయపడిన మావోయిస్టు భవానీకి 24 గంటల్లో మెరుగైన వైద్యం అందించాలని, వెంటనే ఆమెకు రక్షణ కల్పింపించాలని రాష్ట్ర హోంశాఖకు సూచించింది నక్సలిజం పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అధ్యయనాలు ఏమిటి? కేంద్ర ప్రభుత్వంతో ఏమైనా సంప్రదింపులు జరిపిందా? తదితర వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శి, రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. అంతిమంగా నక్సల్స్ సమస్యకు పరిష్కారం చూపించాలని విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.