అత్యాచార కేసుల్లో నెల రోజుల్లోగా చార్జిషీట్ వేసి నిందితులకు శిక్ష పడేలా చేస్తున్నట్లు.. విశాఖ జిల్లా ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో వార్షిక నేర సమీక్ష వివరాలను ఆయన వెల్లడించారు. మావోయిస్టుల ప్రభావం తగ్గిందని అభివృద్ధి నిరోధకులుగా మారడంతో వారిని ఎవరూ విశ్వసించడం లేదని ఎస్పీ వివరించారు. మావోయిస్టు కార్యకలాపాలపై ఒడిశా బలగాలతో సమన్వయం చేసుకుంటూ చేపడుతున్న గాలింపు చర్యలు సత్ఫలితాలిస్తున్నట్లు తెలిపారు. గంజాయి రవాణాపై నిరంతరం నిఘా పెడుతున్నామన్నారు.
గంజాయి రవాణాపై కేసులు గతేడాది కంటే 25 శాతం పెరిగాయి. 2019లో 199 కేసుల్లో 23,172 కేజీల గంజాయిని పట్టుకుంటే.. ఈ ఏడాది 243 కేసుల్లో 4,434 కేజీలు చిక్కింది. గతంలో రైళ్లలో గంజాయి రవాణా జరిగేదని.. కరోనా నుంచి రైలు నిలిచిపోవడంతో రోడ్డు మార్గం గానే రవాణా చేస్తున్నారని.. అందువల్లే ఎక్కువ కేసులు పట్టుబడుతున్నట్లు గుర్తుచేశారు. కరోనా సమయంలో గ్రామీణ జిల్లా పోలీసులు అత్యంత సమర్థవంతంగా సేవలు అందించారన్నారు. ఈ క్రమంలో 499 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారని.. దురదృష్టవశాత్తు వారిలో నలుగురు చనిపోవడం బాధాకరంగా ఉందన్నారు.