స్టైరీన్ గ్యాస్ లీకేజీ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ ఆధ్వర్యంలోని హైపవర్ కమిటీ శనివారం విశాఖలోని ఓ హోటల్‌లో సమావేశమై వివిధ అంశాలపై చర్చించింది. ప్రమాదానికి దారితీసిన అంశాలపై.. సాంకేతిక కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికను అధ్యయనం చేసింది. పరిశ్రమలోని స్టైరీన్ ట్యాంకులు, యంత్రాల్లోని లోపాలు, ఉద్యోగుల నిర్లక్ష్యం, ఉన్నతస్థాయిలో పర్యవేక్షణాలోపం, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోలేకపోవడం, ప్రమాదం అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై అవగాహనరాహిత్యం తదితర అంశాలపైనా కమిటీ సభ్యులు చర్చించారు. పరిశ్రమ యాజమాన్యం ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం.. ప్రమాదం సంభవిస్తే స్టైరీన్ ట్యాంకుల్లో కలపాల్సిన రసాయానాల్ని తగిన మోతాదులో.. అందుబాటులో ఉంచకోకపోవడంపై కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది.
ఎల్జీ సంస్థ నిబంధనలను పాటించిందా? అనే కోణంలో హై పవర్ కమిటీ ఆరా
విశాఖ గ్యాస్ లీకేజీపై హైపవర్ కమిటీ అధ్యయనం మొదలైంది. ఈ మేరకు... విశాఖలో తొలిసారి సమావేశమైన కమిటీ.. స్టైరీన్ ట్యాంకుల శీతలీకరణ విధానం.. రసాయనం వాయు రూపంలోకి వచ్చిన తీరుపై చర్చించింది. ఎల్జీ పాలిమర్స్ సంస్థ పరిశ్రమ హానికర రసాయనాల దిగుమతి చట్టం ప్రమాణాలు పాటించిందా లేదా అనే అంశంపై ఆరా తీసింది. బాధిత గ్రామాలలో పరిస్థితుల పైనా చర్చ జరిగింది. నేడు ప్రజాప్రతినిధులతో హై పవర్ కమిటీ భేటీ కానుంది.
జాతీయ హరిత ట్రైబ్యునల్ ఏర్పాటు చేసిన కమిటీలో ఉన్న ఏయూ ఆచార్యులు సీహెచ్‌వీ రామచంద్రమూర్తి, పీజే రావుతోనూ.... హైపవర్ కమిటీ సభ్యులు చర్చించారు. కర్మాగారాల శాఖ డైరెక్టర్, పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రత సంస్థ-పెసో అధికారులతోనూ సమావేశమయ్యారు. ఎల్జీ పాలిమర్స్ తీసుకున్న అనుమతులు, ఆ సంస్థను తనిఖీ చేసినప్పుడు వెలుగుచూసిన భద్రతా లోపాలు, నిబంధనల ఉల్లంఘనలపైనా చర్చించారు. హైపవర్ కమిటీలో... కేంద్ర ప్రభుత్వ నామినీలుగా ఉన్న అధికారులు.. డెహ్రాడూన్, పుణె, అహ్మదాబాద్, చెన్నై నగరాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ అభిప్రాయాలు చెప్పారు. స్టైరీన్ వాయువు ఆవిరిగా మారి సమీప ప్రాంతాలు వ్యాపించడం వల్ల కలిగిన అనర్థాలు, భవిష్యత్ లో వచ్చే సమస్యలపైనా... కమిటీ ఆరా తీసింది. స్టైరీన్ ప్రభావిత గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితులు... వైద్య పరమైన అంశాలపైనా లోతుగా చర్చించింది.
ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ఉంటే ప్రమాదం జరగకపోయేదని.. పలువురు నిపుణులు హైపవర్ కమిటీ భేటీలో అభిప్రాయపడినట్లు తెలిసింది. ప్రమాదం జరిగినప్పుడు.. ఏం చేయాలనే విషయంపై సిబ్బందిలో అవగాహన లేకపోవడం వల్లే.... తీవ్రత మరింత పెరిగిందని ఎక్కువమంది చెప్పినట్లు సమాచారం.