విశాఖలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూల్చివేతకు అధికారులు యత్నిస్తున్నారంటూ.. హైకోర్టులో అత్యవసరంగా హౌస్ మోషన్ వ్యాజ్యం దాఖలైంది. విశాఖలోని అల్లీపురు వార్డులో ఉన్న తమ పార్టీ భవనం కూల్చివేతకు అధికారులు యత్నిస్తున్నారని.. వాటి చర్యలను నిలువరించాలని కోరుతూ తెదేపా విశాఖపట్నం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ పిటిషన్ వేశారు.
విచారణ చేసిన న్యాయస్థానం.. ఎలాంటి కూల్చివేత చర్యలు చేపట్టవద్దంటూ స్టే ఇచ్చింది. 2018 లో టౌన్ ప్లానింగ్ అధికారులు ఇచ్చిన నోటీసు అమలును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.గంగారావు.. నిలిపివేశారు. పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి, జీవీఎంసీ కమిషనర్ , రీఫ్ సిటీ ప్లానర్ తదితరులకు నోటీసులు జారీ చేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు.