HC On Trees Cutting: ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో చెట్లు నరికివేతపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెట్ల కొట్టివేత ఆలోచన ఎవరిదని.. అటవీశాఖ అధికారులు నుంచి అనుమతులేమైనా పొందారా అని ప్రశ్నించింది. చెట్లు కొట్టివేయలేదని కేవలం పొదలను మాత్రమే తొలగించామని.. శరీరంపై దురదకు కారణమయ్యే మొక్కలను కొట్టేశామని ఏయూ తరపు న్యాయవాది చెప్పడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ మొక్కల పేర్లేమిటో చెప్పాలని నిలదీసింది. కోర్టు ముందున్న ఫొటోలను పరిశీలిస్తే అవి మొక్కలుగా లేవని.. వృక్షాలుగా ఉన్నాయని స్పష్టం చేసింది. దీనిపై పూర్తి వివరాలు సమర్పించేందుకు విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ ఆర్. రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
ఇదీ జరిగింది.. విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలో గతేడాది నవంబరు 12న మోదీ సభ జరిగింది. కాగా అక్కడి గ్రౌండ్లో జరిగే ప్రధాని సభకు సుమారు రెండు లక్షల మంది వచ్చే అవకాశం ఉందనే అంచనాలతో అధికారులు.. గ్రౌండ్ లోపల, వెలుపల చదును చేసే కార్యక్రమాలు చేపట్టారు. దీనిలో భాగంగా సభ జరిగిన మైదానం పరిసరాల్లోని చెట్లను తొలగించారు. సభ ప్రాంగణం చుట్టు పక్కల, అలాగే అక్కడికి చేరుకునే రహదారికి రెండు వైపులా ఉన్న చెట్లను ప్రధాని సెక్యూరిటీ పేరుతో కొట్టేశారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న చెట్లను ప్రధాని పర్యటన పేరుతో నరికేయటం దారుణమని పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు.