‘చెట్లను తిరిగి పెంచగలం.. కొండలను పెంచలేం. చెట్లనే కాదు.. కొండలనూ మరింత జాగ్రత్తగా కాపాడుకోవాలి’.. విశాఖలోని రుషికొండను టూరిజం రిసార్టుల (పర్యాటక పునరుద్ధరణ ప్రాజెక్టు) అభివృద్ధి పేరుతో పరిమితికి మించి విచక్షణారహితంగా తవ్వేస్తున్నారంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాల విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ ఇచ్చిన అనుమతుల పరిధికి మించి నిర్మాణాలు చేపట్టొద్దని, గతంలో ఉన్న భవనాలను కూల్చిన స్థానంలోనే నిర్మాణాలకు పరిమితం కావాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు లోబడి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పింది.
విచక్షణారహిత తవ్వకం, చెట్ల నరికివేతపై వాస్తవాలను తేల్చేందుకు అడ్వకేట్ కమిషన్‌ను నియమించేందుకు ప్రతిపాదించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని, ఆ వివరాలను పరిశీలించాక కమిషన్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది సుమన్ కోరారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను జులై 12కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈమేరకు ఆదేశాలిచ్చింది.
కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జడ్)నిబంధనలకు విరుద్ధంగా రుషికొండపై విచక్షణారహితంగా తవ్వకాలు జరుపుతూ, చెట్లు నరికివేస్తున్నారని పేర్కొంటూ జనసేన కార్పొరేటర్ పీవీఎల్‌ఎన్ మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్ వేశారు. ఇదే అంశంపై విశాఖ తూర్పు నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ మరో పిల్ వేశారు. ఈ రెండు వ్యాజ్యాలు మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చాయి. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి, న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. 5.18 ఎకరాలకే పరిమితమై నిర్మాణాలు జరుపుకొనేందుకు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అనుమతి ఇచ్చిందన్నారు. ఆ పరిధిని దాటి వందల చెట్లు కొట్టేస్తూ, కొండ మొత్తాన్ని పిండి చేస్తున్నారన్నారు. ఇంకో రెండు వారాలు తవ్వకాలు జరిగితే కొండ కనిపించదని తెలిపారు.వ్యర్థాలను సముద్ర తీరంలో కుమ్మరిస్తున్నారన్నారు. తవ్వకాల ఫొటోలను ధర్మాసనం ముందు ఉంచారు. తవ్వక ప్రక్రియను నిలిపివేయాలని కోరారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది సుమన్ వాదనలు వినిపిస్తూ.. అనుమతులకు, సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. పిటిషనర్లు కోర్టు ముందు ఉంచినవి పాత ఫొటోలని.. ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు. కౌంటర్ వేయడానికి సమయం కోరారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.
ఇదీ చదవండి:ఎంపీ రఘురామ భద్రతా సిబ్బందిపై సస్పెన్షన్ వేటు
ఈ ముద్దుగుమ్మల బికినీ సోకులు.. అందానికే హాల్మార్కులు..