HIGHCOURT ON RUSHIKONDA : విశాఖలోని రుషికొండ అక్రమ తవ్వకాలపై నిజాలను నిగ్గు తేల్చేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఏర్పాుచ చేసిన కమిటీలో... ఏపీ ప్రభుత్వ శాఖలకు చెందిన ముగ్గురు అధికారులు ఉండటంపై.. హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. విచక్షణారహితంగా కొండను తవ్వేశారని రాష్ట్ర ప్రభుత్వమే ఆరోపణ ఎదుర్కొంటోందని... అధికారులపైనా కోర్టు ధిక్కరణ దాఖలయిందని గుర్తుచేసింది. అలాంటప్పుడు... రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు కమిటీలో స్థానం ఎలా కల్పిస్తారని ప్రశ్నించింది. కమిటీ ఏర్పాటుపై పునఃపరిశీలించాలని కేంద్ర పర్యావరణ, అటవీశాఖకు సూచించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ N.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
విశాఖలోని రుషికొండను పర్యావరణ పునరుద్ధరణ ప్రాజెక్టు పేరుతో విచక్షణారహితంగా తవ్వేస్తూ, పరిధికి మించి నిర్మాణాలు చేస్తున్నారంటూ.. విశాఖ తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, జనసేన కార్పొరేటర్ పీవీఎల్ఎన్ మూర్తి యాదవ్.. హైకోర్టులో వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలు వేశారు. ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేరి తన వాదనలు వినాలని ఇంప్లీడ్ పిటిష్ దాఖలు చేశారు. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన కోర్టు.. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించేందుకు కేంద్ర, పర్యావరణ, అటవీశాఖకు చెందిన బాధ్యతాయుతమైన అధికారి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది.