HC ON DASAPALLA LANDS : విశాఖలోని దసపల్లా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన మెమోను 15 రోజుల్లో అమలు చేయాలని ఆ జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. న్యాయమూర్తి జస్టిస్ సుజాత ఈనెల 2న ఈ మేరకు ఆదేశాలిచ్చారు. దసపల్లా భూములపై హక్కులు కల్పించాలని రాణీ కమలాదేవి 2000 సంవత్సరంలో హైకోర్టును ఆశ్రయించగా, ఆమెకు అనుకూలంగా ఉత్తర్వులిచ్చింది.
ప్రభుత్వం దాఖలుచేసిన ఎస్‌ఎల్‌పి, క్యూరేటివ్ పిటిషన్లను 2012, 2014లలో సుప్రీంకోర్టు కొట్టేసింది. మరోవైపు దసపల్లా భూములను నిషేధిత జాబితాలో చేరుస్తూ 2015లో ప్రభుత్వం ఉత్తర్వుల్చింది. వాటిని సవాలు చేస్తూ రాణీ కమలాదేవి 2016లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం ఈనెల 2న విచారణకు వచ్చింది. కమలాదేవి తరఫున న్యాయవాది ఎన్.అశ్వినీకుమార్ వాదనలు వినిపించారు.