HIGH COURT ADVISED TO PETITIONER : యథాస్థితి పాటించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ.. పిటిషనర్‌కు చెందిన స్థలం నుంచి రెవెన్యూ, పోలీసు అధికారులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని విశాఖపట్నానికి చెందిన కాట్రగడ్డ లలితేష్ కుమార్ తరఫున న్యాయవాది వీవీ సతీష్ హైకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యవహారంపై అత్యవసర విచారణ జరపాలని వారు కోరారు. అధికార యంత్రాంగం కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ.. పిటిషనర్‌కు ఆందోళనకర పరిస్థితులు కల్పిస్తోందన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత కుమార్, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేసుకోవాలని సూచించింది. విచారణ జరిపి బాధ్యులైన అధికారులను జైలుకు పంపుతామని హెచ్చరించింది.
చట్టబద్ధంగా తనకు దఖలు పడిన విశాఖపట్నంలోని మర్రిపాలెం సర్వే నెంబరు 81/1, 81/3లో 17,135 చదరపు మీటర్ల విస్తీర్ణాన్ని రద్దు చేసే నిమిత్తం 2020 ఏప్రిల్ 23వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 115ను కొట్టివేయాలని కోరుతూ వ్యాపారవేత్త కాట్రగడ్డ లలితేష్కుమార్ అదే ఏప్రిల్ నెలలో హైకోర్టులో వ్యాజ్యం వేశారు. లోతైన విచారణ జరిపిన న్యాయస్థానం.. జీవో 115ని రద్దు చేస్తూ 2022 డిసెంబర్ 22న తీర్పు ఇచ్చింది. గతంలోనూ ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపట్టిందని.. న్యాయస్థానం తప్పుపట్టడంతో చర్యలను ఉపసంహరించుకుందని గుర్తు చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. రెవెన్యూ అర్బన్, ల్యాండ్ సీలింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి, భూపరిపాలన చీఫ్ కమిషనర్, విశాఖ అర్బన్ ల్యాండ్ సీలింగ్ ప్రత్యేక అధికారి, విశాఖపట్నం తహశీల్దార్.. ధర్మాసనం ముందు అప్పీల్ వేశారు.