విశాఖ శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారిని ప్రముఖ సినీ కథానాయకుడు శర్వానంద్ దర్శించుకున్నారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకుని బేడామండపం ప్రదక్షిణం చేశారు. అంతరాలయంలో స్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. ఈవో సూర్యకళ స్వామివారి ప్రసాదం అందజేశారు.
సింహగిరిపై ‘మహా సముద్రం’ చిత్రీకరణ
ఆర్‌ఎక్స్-100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న మహా సముద్రం చిత్రం షూటింగ్ సోమవారం సింహగిరిపై ఆలయ ప్రాంగణంలో జరిగింది. ప్రముఖ కథానాయకుడు శర్వానంద్, కథానాయిక ఆదితీరావు హైదరీ ముఖ్య పాత్రధారులుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ 90 రోజుల పాటు విశాఖ పరిసరాల్లో జరుగుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. సింహగిరిపై జరిగిన ఒకరోజు షూటింగ్‌లో ఆధ్యాత్మిక ప్రవచనాలు, కథానాయిక కుటుంబ సభ్యులకు సంబంధించి సన్నివేశాలను చిత్రీకరించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.