భారీ వర్షంతో విశాఖ జిల్లాలోని నదులు ఉగ్రరూపం దాల్చాయి. చోడవరం- మాడుగుల నియోజకవర్గాల్లోని శారదా, పెద్దేరు, బొడ్డేరు, వరాహ నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద నీటితో 4 జలాశయాలు నిండుకుండలా మారాయి. లోతట్టు ప్రాంత ప్రజలు భయం, భయంగా గడుపుతున్నారు. భోగాపురం, లక్కవరం, చాకిపల్లి, పీఎస్ పేట, జన్నవరం వద్ద గండ్లు పడి రహదారులపై వరద నీరు రావడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
ఎగువ ప్రాంతాల నుంచి జలాశయాల్లోకి పెద్ద మొత్తంలో వరద నీరు చేరుతోంది. రైవాడ, పెద్దేరు, కోనాం ప్రధాన జలాశయాల నుంచి వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. రైవాడ జలాశయంలోకి ఇన్ ఫ్లో 4,084 క్యూసెక్కులు రాగా.. 8,840 క్యూసెక్కుల నీటిని శారదానదిలోకి వదులుతున్నారు. పెద్దేరు జలాశయంలోకి ఇన్ ఫ్లో 2,315 క్యూసెక్కులు వస్తుండగా.. అంతే మొత్తాన్ని దిగువకు వదులుతున్నారు.