రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇసుక ఆన్లైన్ విధానంలో ధర కంటే.. పక్క రాష్ట్రమైన ఒడిస్సాలో తక్కువ ధరకు ఇసుక లభిస్తుంది. సకాలంలో అక్కడి నుంచి ఇసుక సరఫరా చేస్తుండటం కూడా ఎక్కువ మంది అక్కడ నుంచి ఇసుకను తెచ్చుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో ఇసుక కావాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఒక్కోసారి సర్వర్ పనిచేయకపోవటం, సర్వర్ పని చేసిన డిపో నుంచి ఇసుక రావటానికి రోజుల తరబడి సమయం పడుతుంది. ఈ ఇబ్బందులన్నీ పడలేక విశాఖ నగరంతో పాటు.. పరిసర ప్రాంతాల నిర్మాణదారులు ఒడిస్సా నుంచి ఇసుకను కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతున్నారు.
రాష్ట్రంలో నూతన ఇసుక విధానం అమలులోకి తెచ్చిన తరువాత సామాన్య ప్రజల నుంచి భవన నిర్మాణదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఇసుక బుక్ చేసుకున్న వారికి సకాలంలో సరఫరా చేయలేకపోతోంది. ఈ సమస్య మొదటి నుంచి ఉన్నప్పటికీ సరిదిద్దు కోలేకపోతున్నారు. జిల్లా స్థాయి అధికారులు పలుమార్లు ఈ సమస్యను ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పరిష్కారం చూపలేక పోతున్నారు.
జిల్లాలో ఇసుక డిమాండ్‌ను గుర్తించిన కొందరు వ్యాపారులు ఒడిస్సా వ్యాపారులతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. అక్కడ ఆధార్ నెంబర్‌పై ఇసుక బుక్ చేసుకునే వెసులుబాటు కూడా ఉందని లబ్ధిదారులు వాపోతున్నారు. ఒడిశాలోని రాయగడ, కాశీ నగర్, బరంపురం, కటక్ లతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో ఉన్న నదులు ద్వారా ఇసుక పుష్కలంగా లభ్యమవుతుంది. దీంతో ఒడిశా నుంచి విశాఖ మీదుగా విజయవాడ, రాజమండ్రి ప్రాంతాలకు ఇసుక రవాణా చేస్తున్నారు.