GYV Victor was Completely Removed from the Company: విశాఖలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీసీఐ) సంస్ధ సీఈవో, ఎండీగా ఇంత వరకూ సస్పెన్షన్‌లో ఉన్న డాక్టర్ జీవైవీ విక్టర్‌ను శాశ్వతంగా ఆ పదవి నుంచి, సంస్ధ నుంచి తొలగిస్తూ కమిటీ నిర్ణయించి అమలుకు ఆదేశాలిచ్చింది. గతేడాది సస్పెన్షన్‌కి గురైన విక్టర్ పై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులపై నిగ్గుతేల్చిన విజిలెన్స్ విభాగం ఇచ్చిన నివేదికను ఉన్నత స్దాయి కన్సార్టియం కమిటీ పరిశీలించి వాటిని నిర్ధారించుకుంది.
దీనిపై ఆయన్ని శాశ్వతంగా తొలగించాలని నిర్ణయించడంతో కన్సార్టియం ఛైర్మన్‌గా ఉన్న విశాఖ పోర్టు అధారిటీ ఛైర్మన్ కె. రామ్మోహనరావు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధగా ఒకప్పుడు డీసీఐ ఉండేది. దానిని ప్రయివేటీకరణ చేసేందుకు నిర్ణయించిన తర్వాత పెద్ద ఎత్తున అందోళనలు చోటు చేసుకోవడం, ఒక కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడడం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కేంద్రంపై పెద్ద ఎత్తున తెచ్చిన ఒత్తిడి తెచ్చారు. దీంతో అన్నీ ఫలించి డీసీఐని పోర్టుల కన్సార్టియంకి కేంద్రం అప్పగించింది.
పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఇది మనుగడ సాగిస్తోంది. దీనికి తొలి ఎండీ, సిఈవోగా డాక్టర్ జీవైవీ విక్టర్‌ను కమిటీ ఎంపిక చేసింది. తర్వాత ఈయన తన అనుభవానికి సంబంధించిన తప్పుడు ధ్రువ పత్రాలను సమర్పించి ఆ పోస్టుకి ఎంపిక అయ్యారని అభియోగాలను ఎదుర్కొన్నారు. వీటిపై విజిలెన్స్ కూలంకషంగా విచారించి నివేదికను పోర్టు కన్సార్టియం నియమించిన కమిటీకి అప్పగించింది.