GVMC Re Survey in Visakha Forest Department lands: విశాఖ నడిబొడ్డున మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌కు ఎదురుగా, సిరిపురానికి వెళ్లే మార్గంలోని ఓ సర్వే నెంబర్‌లో.. దాదాపు 30 ఎకరాల భూమి ఉంది. ఇందులోనే ఆంధ్రా వర్సిటీకి, అటవీశాఖకు సంబంధించి భూములు ఉన్నాయి. చాలా ఏళ్లుగా ‘వన విహార్’ పేరుతో.. పిలుస్తున్న ఈ ప్రాంతంలోనే.. చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారిక నివాసం ఉంది. ఇక్కడ తమకు దాదాపు 3.62 ఎకరాల భూములు ఉన్నాయని 3 వారాల క్రితం ఓ మహిళ చేసిన దరఖాస్తుతో.. జీవీఎంసీ సర్వే సిబ్బంది శనివారం మధ్యాహ్నం అక్కడికి వచ్చారు. ఐఎఫ్యస్ అధికారి నివాసమున్న ప్రాంతంలోనే సర్వే కూడా చేశారు. సర్వే సిబ్బంది అక్కడికి వచ్చే వరకూ అటవీశాఖ అధికారులకు కూడా సమాచారం లేదని అంటున్నారు.
ఈ ప్రక్రియ అంతా కడప ప్రాంతం నుంచి వచ్చిన ఓ నేత అనుచరుడి కనుసన్నల్లో సాగిందని సమాచారం. సర్వే పూర్తయ్యే వరకూ దరఖాస్తుదారుతోపాటు సదరు వ్యక్తి అక్కడే ఉన్నారు. తొలుత అటవీశాఖ సిబ్బంది నిలువరించే ప్రయత్నం చేసినా వారు ఆగలేదు. దాదాపు ఆరు దశాబ్దాల క్రితం నుంచి.. తమ కుటుంబానికి ‘వన విహార్’ ప్రాంతంలో భూములు ఉన్నాయని దరఖాస్తుదారు చెబుతున్నారు. అయితే ఇన్నాళ్లు ఏయూ, అటవీ భూములని చెబుతున్నా ఎందుకు రాలేదో తెలియదు. దరఖాస్తు చేసిన కొన్ని రోజుల్లోనే జీవీఎంసీ సిబ్బంది చాలా వేగంగా స్పందించడానికి కారణాలేంటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.