విశాఖపట్నం ఆక్రమణల అడ్డాగా మారుతోంది. నగరవ్యాప్తంగా 10వేలకు పైగా అక్రమ నిర్మాణాలున్నట్లు జీవీఎంసీ అధికారుల అంచనా. దీనిపై ప్రాథమికంగా ఆధారాలున్నప్పటికీ మరింత స్పష్టత కోసం లోతైన సర్వే చేస్తున్నారు. జీవీఎంసీలోని తాజా, పాత రికార్డుల ఆధారంగా వార్డు సచివాలయాల వారీగా సర్వే కొనసాగిస్తున్నారు. గుర్తించిన ప్రతీ ఆక్రమణకు సంబంధించి ఫోటోతో పాటు అక్షాంశాలు, రేఖాంశాల్ని సైతం ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు.
విశాఖలో 10 వేలకు పైగా అక్రమ నిర్మాణాలు! కబ్జాలు.. అనుమతల్లేని కట్టడాలు..!
విశాఖను పరిపాలన రాజధాని చేస్తున్నారనే ప్రకటన వెలువడ్డాక.. నగరంలో కబ్జాలు పెరిగాయి. ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలతో పాటు అనుమతుల్లేకుండా ఇళ్లు నిర్మించుకోవడం, తీసుకున్న అనుమతికి మించిన స్థలంలో నిర్మాణాల్ని విస్తరించుకోవడం, ఇదివరకే ఉన్న భవనంపై అనుమతి లేకుండా అంతస్తులు పెంచుకోవడం లాంటి వాటిని అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు వచ్చిన స్పష్టత ప్రకారం 4100కు పైగా తాజా ఆక్రమణలు వెలుగులోకి వచ్చాయి. వీటికి సంబంధించి సమగ్ర ఆధారాలు సేకరించారు. ఇవన్నీ గత 4 మాసాల నుంచి నిర్మాణంలో ఉన్నట్లు తేల్చారు. ఈ సర్వేను మరికొన్నాళ్ల పాటూ కొనసాగిస్తూ.. పాత నిర్మాణాల్లో మార్పులను గుర్తిస్తున్నారు. మరో 6వేల ఆక్రమణలు బయటపడొచ్చనే అంచనాలున్నాయి.
ఈ మధ్యే జరిపిన మరో సర్వేలో విశాఖ వ్యాప్తంగా 38 చెరువుల్లో ఆక్రమణలున్నట్లు గుర్తించారు. కొన్నింటికి నోటీసులు కూడా ఇచ్చేశారు. కూల్చడమే తరువాయి. అక్రమ నిర్మాణాల్ని క్రమబద్ధీకరించుకునేందుకు బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్) కింద దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమిచ్చేవారు. ఇకపై ఇలాంటి పథకముండదని జీవీఎంసీ అధికారులకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి అక్రమ నిర్మాణాన్ని ఆధారాలు చూపించి కూల్చివేసేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది.
ఇదీ చదవండి.'అతిథి దేవో భవ' సూత్రాన్ని పాటిస్తున్న రోబోలు..!