Shops Boards Removed In Vizag: విశాఖపట్టణం సీతమ్మధారలోని ఓ మందుల దుకాణానికి సుమారు పది మంది కార్పొరేషన్ సిబ్బంది హడవుడిగా చేరుకున్నారు. అంతమంది సిబ్బంది రావటంతో మందుల దుకాణం వద్ద ఉన్న కొనుగోలుదారులు ప్రశ్నార్థకంగా వారినే చూశారు. వారితో పాటు ఓ జేసీబీని వెంట తెచ్చారు. ఇంతమంది సిబ్బంది రావటం, అది కూడా జేసీబీతో రావడం ఏంటనీ దుకాణం యజమానులు ఆలోచిస్తుండగానే, అధికారులు ఓ పేపర్‌ను చేతిలో పెట్టారు. మందుల షాపు పేరుతో ఏర్పాటు చేసిన బోర్డుపై విధించిన పన్ను చెల్లించకపోవటంతోనే.. తాము వచ్చినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా క్షణాల్లో మెడికల్ షాప్‌కు వేలాడదీసిన బోర్డును ప్రొక్లెయిన్ సహాయంతో తొలగించారు. బోర్డును తొలగిస్తే,తమ షాపు ఉన్న సంగతి ఎలా తెలుస్తుందని.. దుకాణదారులు ఎంతగా బ్రతిమాలినా, కార్పోరేషన్ సిబ్బంది బోర్డును తొలగించటం ఆపలేదు. 20 నుంచి 30 సంవత్సరాలుగా దుకాణాలు నిర్వహిస్తున్నామని.. ఎప్పుడు ఇలాంటి పన్నులను చూడలేదని దుకాణ యాజమాని వాపోయారు.
ఏం జరిగిందంటే : మందుల దుకాణాదారుడు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్టణంలోని సీతమ్మధారలో నిర్వహిస్తున్న ఓ మందుల దుకాణానికి.. సుమారు పది మంది కార్పొరేషన్ సిబ్బంది వచ్చారు. వచ్చి రావటంతోనే ప్రకటన బోర్డు కోసం విధించిన పన్ను చెల్లించకపోవడంతో బోర్డు తొలగిస్తమని తెలిపారు. ఆ సమయంలో దుకాణ నిర్వాహకులు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. తొలగింపు ఆదేశాలు చూపించాలని సిబ్బందిని కోరినా.. ఎటువంటి తొలగింపు నోటీసులు చూపించలేదు. తొలగింపుపై ముందస్తు సమాచారం లేకుండా.. ఎలా తొలగిస్తారని ప్రశ్నించగా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండని దురుసుగా ప్రవర్తించరాని దుకాణ యాజమాని వాపోయారు.
దుకాణానికి వేలాడదీసిన బోర్డును తొలగించి తీసుకెళ్లారు. నోటీసులో పేర్కొన్న వివరాల ప్రకారం పన్ను చెల్లించకుంటే.. ఇదే విధంగా బోర్డుల తొలగిస్తామని హెచ్చరించారని పక్కనున్న దుకాణదారులు ఆందోళన చెందుతున్నారు. ఆ ప్రాంతంలోని మిగిలిన దుకాణాదారులకు సచివాలయ ఉద్యోగుల ద్వారా నోటీసులు అందించారు. మందుల దుకాణాలు, ఆసుపత్రులకు డిస్ప్లే డివైస్ పన్ను కింద జీవీఎంసీ ప్రణాళికా విభాగం డిమాండు నోటీసులు అందిస్తోంది. ఇప్పటికే నగరంలో పలు దుకాణాలకు అందించింది.