Comments of BJP Leaders on YS Jagan: జగనన్నే మా భవిష్యత్ అంటే ప్రజల భవిష్యత్ పూర్తి అంధకారం కావడం ఖాయమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.విష్ణుకుమార్ రాజు విమర్శించారు. విశాఖలో వైఎస్సార్సీపీ నేతలు భూములు దోచుకున్నారని ఆరోపించారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు ఇస్తామని చెప్పినందున.. ఎమ్మెల్యేలకు మాత్రమే జగన్‌పై నమ్మకం ఉందన్నారు.
జగన్ దోచుకున్న సొమ్ము రూ.50 వేల కోట్ల పై మాటేనని విష్ణుకుమార్ చెప్పారు. మద్యం ద్వారా వేల కోట్లు ప్రజా సొమ్ము దోచుకున్నారని, రాష్ట్రంలో అవినీతి తారాస్థాయికి చేరుకుందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బండారం బయట పడుతుందన్నారు. ఆంధ్రాలో బీజేపీ బలోపేతానికి పార్టీలో కొత్తగా చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కృషి చేస్తారన్నారు. ఈ సందర్భంగా 'జగనన్నే మా భవిష్యత్ అయితే.. ప్రజల భవిష్యత్ అంధకారమే' అనే ప్లకార్డులు ప్రదర్శించారు.
"మా నమ్మకం నువ్వే జగన్ అని మనం చెప్పడం లేదు.. వాళ్ల ఎమ్మెల్యేలు చెప్తున్నారు. వాళ్లకు మాత్రం జగన్ మీద నమ్మకం ఉంది. ఎందుకంటే సంవత్సరంలో ఒక్కో ఎమ్మెల్యేకు 50 కోట్ల రూపాయలు ఇస్తారట. కాబట్టి వాళ్లకి ప్రస్తుతానికి నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి దోచుకున్న డబ్బు.. ఈ నాలుగేళ్లలో కనీసం 50 వేల కోట్లు ఉంటుంది. మద్యం ద్వారా కోట్ల రూపాయలు దోచుకున్నారు". - పి.విష్ణుకుమార్ రాజు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు