వినుకొండ పట్టణ సీఐ చిన్న మల్లయ్య ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తొత్తుగా వ్యవహరించి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెదేపా, సీపీఐ అభ్యర్థులను బెదిరించి దౌర్జన్యాలకు పాల్పడ్డాడని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు. ఎమ్మెల్యే బొల్లా అండదండలతో సీఐ చిన్న మల్లయ్య ఏకపక్షంగా వ్యవహరించారని... 9వ తేదీ రాత్రి తెదేపా, సీపీఐ అభ్యర్థుల వార్డులకు వెళ్లి, పిలిపించి తప్పుడు కేసులు బనాయించి రౌడీషీట్లు ఓపెన్ చేస్తానని బెదిరించడం దుర్మార్గమన్నారు. సీఐ చిన్న మల్లయ్య పట్టణంలోని అన్ని వార్డులు వైకాపాకి గెలిపించి ఇస్తానని ఎమ్మెల్యేతో ఒప్పందం కుదుర్చుకొని దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆరోపించారు. 10వ తేదీన జరిగిన మున్సిపల్ ఎన్నికల బూత్‌ల వద్ద సీఐ చిన్న మల్లయ్య అత్యుత్సాహాన్ని ప్రదర్శించి అభ్యర్థులను ఓటర్లను భయబ్రాంతులకు గురి చేశారని జీవీ ఆరోపించారు. 27వ వార్డు వద్ద అభ్యర్థి భర్త భూదాల చిన్నపై సీఐ దౌర్జన్యం చేయటం అమానుషమన్నారు. చిన్న మల్లయ్య కులం పేరుతో దూషించి గొడవలు సృష్టించి ప్రోత్సహిస్తూ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారు అన్నారు. కౌన్సిల్లో ప్రతిపక్షం ఉండరాదని దౌర్భాగ్యం ఎమ్మెల్యే ఆలోచనకు సీఐ చిన్న మల్లయ్య ఊతమిస్తూ తప్పుడు కేసులు పెడతానని, ఎన్కౌంటర్ చేస్తానని బెదిరిస్తున్నారని ఆరోపించారు.
సీఐపై ఫిర్యాదు చేస్తాం
బుధవారం జరిగిన వినుకొండ పురపాలక సంఘం ఎన్నికల్లో పట్టణ సీఐ చిన్న మల్లయ్య చేసిన దౌర్జన్యాలపై పోలీస్ ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామని సీపీఐ ఏరియా కార్యదర్శి మారుతి వరప్రసాద్ తెలిపారు. పట్టణ సీఐ చేస్తున్న దౌర్జన్యాలను ప్రజలు గమనిస్తున్నారని అఖిలపక్ష పార్టీలతో ప్రజా సంఘాలను కలుపుకొని సీఐ చిన్న మల్లయ్యపై చర్యలు తీసుకునేంతవరకు ఉద్యమం చేస్తామని మారుతి వరప్రసాద్ తెలిపారు.