ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణకు పచ్చజెండా! - privatization of Visakhapatnam Steel latest news

విశాఖ స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు అనుమతించిన కేంద్ర మంత్రివర్గం తదుపరి అనుసరించాల్సిన కార్యాచరణ బాధ్యతలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కే వదిలిపెట్టినట్లు తెలిసింది.

vsp steel
vsp steel

By

Published : Feb 3, 2021, 8:04 AM IST

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు కేంద్ర కేబినెట్‌ గత వారం ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం. ప్రస్తుతం వంద శాతం ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్న ఈ సంస్థలోని కొంత వాటాను విక్రయించడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు అనుమతించిన కేంద్ర మంత్రివర్గం తదుపరి అనుసరించాల్సిన కార్యాచరణ బాధ్యతలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కే వదిలిపెట్టినట్లు తెలిసింది.

ఆర్‌ఐఎన్‌ఎల్‌ విక్రయ లావాదేవీల్లో దాని అనుబంధ సంస్థలైన ఒడిశా మినరల్స్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీ, బిస్రా స్టోన్‌ లైమ్‌ కంపెనీలను చేర్చాలా? లేదా? అన్న విషయంపై పెట్టుబడిదారుల అభిప్రాయాలు తీసుకున్నాకే ఒక నిర్ణయానికి రావాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈసారి పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్లను సమీకరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పేర్కొన్న నేపథ్యంలో దీని పెట్టుబడుల ఉపసంహరణ వేగం పుంజుకొనే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో స్టీల్‌కు డిమాండ్‌ నెలకొన్నందున ఇదే అనువైన సమయమని ప్రభుత్వం భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

సొంత గనుల్లేకే నష్టాలు

సొంత గనులు లేకపోవడం వల్లే విశాఖ స్టీల్‌కు నష్టాలు సంభవిస్తున్నట్లు కేంద్ర ఉక్కుశాఖ పార్లమెంటు స్థాయీసంఘానికి తెలిపింది. సంస్థ నష్టాలకు కారణాలేంటని స్థాయీసంఘం వేసిన ప్రశ్నకు ఉక్కుశాఖ బదులివ్వడంతోపాటు, సంస్థపరంగా చేపట్టిన కార్యాచరణను ఏకరువు పెట్టింది. స్థాయీసంఘానికి ఉక్కు మంత్రిత్వశాఖ సమర్పించిన నివేదికలో..‘‘సొంత ఇనుప ఖనిజ గనులు లేని ఏకైక ప్రభుత్వరంగ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌. దానివల్ల ఆ సంస్థ మార్కెట్‌రేట్లకు అనుగుణంగా బయటి నుంచి ముడిసరకు కొంటోంది. దీంతో విశాఖస్టీల్‌ మార్కెట్‌ ధరల ఒడిదొడుకులకు లోనవుతోంది. ఫలితంగా విక్రయించే ప్రతి టన్ను స్టీల్‌పై రూ.5వేలు కోల్పోవాల్సి వస్తోంది.

తద్వారా సంస్థపై ఏటా రూ.3వేల కోట్ల భారం పడుతోంది. 2018 అక్టోబర్‌నాటి ధరలతో పోలిస్తే 2019 అక్టోబర్‌నాటికి టన్ను విక్రయంపై రూ.10,194 ఆదాయం తగ్గిపోయింది. 2019 నవంబర్‌ నుంచి మార్కెట్‌ పరిస్థితులు మెరుగుపడినా 2018-19కంటే ఒక్కోటన్నుపై రూ.5,099 ఆదాయం తక్కువ వస్తోంది. అమ్మకాల ఆదాయం భారీగా తగ్గిపోవడం వల్ల 2019-20 ఏప్రిల్‌-జనవరి మధ్యకాలంలో సంస్థ రూ.1,747కోట్ల నష్టాన్ని మూటగట్టుకొంది. గతేడాది నుంచి పరిస్థితులు మెరుగుపడటంతో ఉత్పత్తిని పెంచడానికి 2020 ఫిబ్రవరి నుంచి 3 బ్లాస్‌ఫర్నేస్‌ ఆపరేషన్‌ మొదలుపెట్టింది.

మార్కెట్‌ పరిస్థితులు ప్రభావం చూపుతున్నా ఉత్పాదకతను మెరుగుపరచుకొని సవాళ్లను అధిగమించడానికి సంస్థ ప్రయత్నిస్తోంది’’ అని పేర్కొంది. దీన్ని స్థాయీసంఘం ఏకీభవించింది. ఇనుప ఖనిజం, థర్మల్‌, కొకింగ్‌కోల్‌ బ్లాక్‌ల కోసం జరిగే ఈ వేలంలో విశాఖస్టీల్‌ పాల్గొనాలని సూచించింది. లేదంటే మైన్స్‌, అండ్‌ మినరల్స్‌(డెవలప్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌) అమెండ్‌మెంట్‌ యాక్ట్‌ 2015లోని సెక్షన్‌ 17ఎ(2ఎ) ప్రకారం గనులను ఈ సంస్థ కోసం కేటాయించేలా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించాలని పేర్కొంది. సొంత గనులు సంపాదించుకొని, లాభాల కోసం విశాఖ స్టీల్‌ యత్నించాలని సూచించింది.

ఇదీ చదవండి:

కర్రలు, రాడ్లతో తెదేపా నేత పట్టాభిపై దాడి.. మోకాలు, చేతులకు గాయాలు

ABOUT THE AUTHOR

...view details