చెరకు రైతులకు ఇది చక్కెర వంటి వార్తే. జాతీయ సహకారాభివృద్ధి సంస్థ మంజూరు చేసిన రుణ నగదును రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయటంతో చెరకు రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. 2018-19 సంవత్సరంలో చెరకు రైతులకు చక్కెర కర్మాగారాలు అందజేయాల్సిన నగదును చెల్లించలేదు. మార్కెట్లో చక్కెర ధర ఆశాజనకంగా లేక రైతులు విలవిల్లాడారు. దీంతో రైతులు గతంలో నగదు చెల్లించాలని ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు. ఒక పక్క రైతుల నిరసనలు, మరో పక్క ఆర్థిక కష్టాలతో చక్కెర కర్మాగారాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీపై జాతీయ సహకారాభివృద్ధి సంస్థ 100 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేసింది. ఈ నగదు మెుత్తాన్ని విడతల వారీగా చెల్లిస్తున్నారు. ఇందులో భాగంగా మెుదటి విడతగా,30 కోట్లు విడుదలయ్యాయి.