ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 26, 2020, 8:11 AM IST

ETV Bharat / state

స్టైరీన్‌ గ్యాస్ లీకేజీపై జూన్ 17 నాటికి నివేదిక

విశాఖ ఎల్​జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజీ ఘటనపై విచారణ చేపట్టిన ఉన్నత స్థాయి కమిటీ.. జూన్ 17 నాటికి నివేదిక సమర్పించే అవకాశం ఉంది. ఈ ఘటనపై సమగ్ర సమాచారం తీసుకుంటున్న కమిటీ.. సవివరంగా ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని తెలిపింది.

visakha lg polymers
visakha lg polymers

విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి స్టైరీన్‌ గ్యాస్‌ లీకైన దుర్ఘటనపై విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ జూన్‌ 17 నాటికి నివేదిక సమర్పించే అవకాశముంది. వివిధ రకాల సంస్థలు, వ్యక్తుల నుంచి ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని మెయిల్‌ ద్వారా, నేరుగా ఇప్పటికే స్వీకరించిన కమిటీ.. నెలాఖరు వరకూ ఈ ప్రక్రియను కొనసాగించాలని నిర్ణయించింది.

ఆసక్తి ఉన్నవారు మే 31లోగా convenorhpc@gmail.com మెయిల్‌కు ఆ వివరాలు పంపించాలని సూచించింది. జూన్‌ 10 కల్లా వివిధ నియంత్రణ సంస్థలు, ఎల్‌జీ పాలిమర్స్‌ ప్రతినిధులు సహా ఇతర స్టేక్‌ హోల్డర్స్‌ నుంచి వాటిపై సమగ్ర సమాచారాన్ని కమిటీ తీసుకోనుంది. వీటన్నింటిపై వివరంగా చర్చించిన తర్వాత.. వారంలోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని ఉన్నతస్థాయి కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది.

కమిటీలో నలుగురు సాంకేతిక నిపుణులు

గ్యాస్‌ లీకేజీ ఘటనపై విచారణకు ఉన్నత స్థాయి కమిటీ.. నలుగురు సాంకేతిక నిపుణులను తీసుకుంది.

  • డాక్టర్‌ ఎస్‌కే నాయక్‌, డైరెక్టర్‌ జనరల్‌, సీపెట్‌, చెన్నై (కేంద్ర రసాయనాలు, పెట్రోకెమికల్‌ మంత్రిత్వ శాఖ నుంచి)
  • భగత్‌ శర్మ, అదనపు డైరెక్టర్‌, వాతావరణ మార్పుల ప్రాంతీయ కేంద్రం, పుణె (కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నుంచి)
  • డాక్టర్‌ ఆర్‌కే ఇళంగోవన్‌, డీజీ, ఫ్యాక్టరీ అడ్వైజ్‌ సర్వీస్‌ అండ్‌ లేబర్‌ ఇన్‌స్టిట్యూట్స్‌, ముంబయి (కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ నుంచి)
  • డాక్టర్‌ అంజన్‌ రే, డైరెక్టర్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం, డెహ్రాడూన్‌ (జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నుంచి)

సందిగ్ధంలో పరిశ్రమ విస్తరణ?

ఎల్‌జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనతో పరిశ్రమ రెండో దశ విస్తరణ సందిగ్ధంలో పడింది. పరిశ్రమ విస్తరణ కోసం నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం, విశాఖపట్నంలోని పోర్టుకు సమీపంలో భూములను ఎల్‌జీ ప్రతినిధులు పరిశీలించారు. నెల్లూరు జిల్లాను దాదాపుగా ఎంపిక చేసుకున్నారు. ఈ విషయంపై అధికారులతో చర్చిస్తున్నారు. ఇదే సమయంలో గ్యాస్‌ లీకేజీ ప్రమాదంతో ప్రస్తుతం పరిశ్రమ మనుగడే సందిగ్ధంలో పడింది.

ప్రస్తుతం ఎల్‌జీ పాలిమర్స్‌లో సుమారు 370 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. మరో 70 మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. స్టైరీన్‌ లీకేజీ దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే ఎల్‌జీ పాలిమర్స్‌ భవిష్యత్తు ఆధారపడి ఉందని మరో అధికారి తెలిపారు. పరిశ్రమను వేరే చోటికి తరలించాలంటే కనీసం రెండేళ్లు పడుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి:

పొలాల్లోనే టమాటా పాతర.. అప్పుల భారంతో ఆత్మహత్యలు

ABOUT THE AUTHOR

...view details