ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'స్వగృహ' ప్లాట్లు పెద్దల పరం.. ఆరు భారీ ప్లాట్ల వేలానికి ప్రకటన !

Swagruha Plots in Visakha:మధ్య తరగతి కుటుంబాల కోసం నిర్మించ తలపెట్టిన 'స్వగృహ' ప్లాట్లు.. పెద్దల పరం కానున్నాయి. విశాఖ ఎండాడలో చేపట్టిన గృహనిర్మాణ ప్రాజెక్టులోని.. ఆరు భారీ ప్లాట్ల వేలానికి తాజాగా ప్రకటన జారీ అయింది. వెయ్యి కోట్ల రూపాయల ఆదాయ సమీకరణే లక్ష్యంగా ఈ ప్రక్రియ జరగబోతోంది.

Swagruha Plots in Visakha
Swagruha Plots in Visakha

By

Published : May 8, 2022, 4:31 AM IST

Updated : May 8, 2022, 5:55 AM IST

'స్వగృహ' ప్లాట్లు పెద్దల పరం

మధ్య తరగతి కుటుంబాల కోసం విశాఖలోని ఎండాడలో ప్రారంభించి, అసంపూర్తిగా నిలిపివేసిన గృహ నిర్మాణ ప్రాజెక్టు ఇక కలగానే మిగలబోతోంది. ఈ భూమి పెద్దల చేతుల్లోకి వెళ్లబోతోంది. ఈ భూముల్లో భారీ విస్తీర్ణంలో ప్లాట్లు చేసి, వేలం వేసేందుకు స్వగృహ కార్పొరేషన్‌ సన్నాహాలు చేస్తోంది. వీటిని విక్రయించి వెయ్యి కోట్ల రూపాయలకుపైగానే ఆర్జించాలన్నది ప్రభుత్వ యోచన. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో మధ్యతరగతి కుటుంబాలకు అనువైన ధరలకు అపార్ట్‌మెంట్లు, వ్యక్తిగత గృహాల నిర్మాణం కోసం.. స్వగృహ ప్రాజెక్టును ప్రారంభించారు. అన్ని పట్టణాల్లోనూ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.

విశాఖలో తీరానికి సమీపంలోని ఎండాడలో 57 ఎకరాల విస్తీర్ణంలో ఆద్రజ ప్రాజెక్టు పేరుతో చేపట్టే అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ల కోసం.. అప్పట్లో దాదాపు 12 వేల మంది దరఖాస్తులు చేశారు. వీరి నుంచి రెండు, మూడు వాయిదాల సొమ్ము కూడా స్వగృహ కార్పొరేషన్‌ అధికారులు వసూలు చేశారు. దాదాపు 15 శాతం పనులు పూర్తయ్యాక నిధుల కొరతతో ప్రాజెక్టు నిలిచిపోయింది. ఎండాడ అప్పట్లో విశాఖకు కాస్త దూరం అనిపించినా క్రమంగా నగరం విస్తరించడంతో ఆద్రజ ప్రాజెక్టు భూముల విలువ ఇప్పుడు భారీగా పెరిగింది. దరఖాస్తుదారుల్లో కొందరికి వారు చెల్లించిన సొమ్ము ఇప్పటికే వెనక్కి ఇచ్చారు.

ఎండాడలో భూమిని పెద్దలకు విక్రయించేందుకే అధికారులు ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లారు. 57 ఎకరాల్లో పదెకరాలను మౌలిక సదుపాయాలకు కేటాయించారు. మిగతా 47 ఎకరాల్లో.. 22 వేల 264 చదరపు గజాల చొప్పున... ఏడు భారీ ప్లాట్లు వేశారు. ఆ లేఅవుట్‌కు విశాఖ మెట్రోపాలిటన్‌ రీజియన్‌ అభివృద్ధి సంస్థ నుంచి ఈ ఏడాది మార్చిలో స్వగృహ కార్పొరేషన్‌ అనుమతులు పొందింది. వీటిలో ఆరు ప్లాట్లను వేలం వేసేందుకు అధికారులు తాజాగా నోటిఫికేషన్‌ ఇచ్చారు. చదరపు గజం ప్రారంభ 60 వేల రూపాయలుగా నిర్ణయించారు. జూన్‌ 13లోగా బిడ్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొన్నారు. భారీ విస్తీర్ణంలో ప్లాట్లు వేసినందున వేలంలో పెద్దలే పాల్గొనగలరు.

ఇదే భూములను 200 నుంచి 250 చదరపు గజాల్లో ప్లాట్లుగా వేసి లేఅవుట్‌ అభివృద్ధి చేసి ఉంటే.. మధ్య తరగతి కుటుంబాలు వేలంలో పాల్గొనే వీలుండేది. కనీసం మధ్య తరగతికి వీలుగా అపార్ట్‌మెంట్లు నిర్మించినా చాలామంది తీసుకోడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రభుత్వం ఆద్రజ ప్రాజెక్టు లక్ష్యానికి పూర్తిగా పాతరేసి, దీన్ని పెద్దల భారీ వ్యాపారానికి వీలుగా మార్చేసిందన్న విమర్శలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. వేలంలో చదరపు గజం ప్రారంభ ధర 60 వేల రూపాయలుగా నిర్ణయించారు. 22 వేల 264 చదరపు గజాల విస్తీర్ణంలోని ఒక్కో ప్లాట్‌పై ప్రభుత్వానికి కనిష్ఠంగా 133.58 కోట్ల రూపాయలకుపైగా ఆదాయం రానుంది. గరిష్ఠంగా 150 కోట్లు పైనే రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన మొత్తం ఆరు ప్లాట్లపై ప్రభుత్వానికి వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందని భావిస్తున్నారు.

Last Updated : May 8, 2022, 5:55 AM IST

ABOUT THE AUTHOR

...view details