విశాఖ జిల్లాలో 15 ఆస్తులను రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్- ఏపీఎస్డీసీకి బదలాయించేందుకు జిల్లా యంత్రాంగం.... సీసీఎల్ఏకి పూర్తి వివరాలతో ప్రతిపాదనలు పంపింది. జిల్లా కలెక్టర్ పంపిన ఈ నివేదికలోని అంశాలు బయటకు రాకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం..15 ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో 2వేల కోట్లకుపైగా ఉండొచ్చని అంచనా. జాబితాలో పేర్కొన్న ఆస్తుల్లో వివిధ శాఖల ప్రభుత్వ కార్యాలయాల భవనాలు, ఖాళీ స్థలాలున్నాయి.
మహరాణిపేట, సీతమ్మధార, గోపాలపట్నం, విశాఖ గ్రామీణ తహసీల్దార్ కార్యాలయాల పరిధిలోని వీటి విస్తీర్ణం 200 ఎకరాలున్నట్టు సమాచారం. రాష్ట్ర ఆర్థిక అవసరాలకు ఏపీఎస్డీసీ ద్వారా వివిధ బ్యాంకుల నుంచి ప్రభుత్వం రుణం తీసుకుంటోంది. 1600 కోట్ల అప్పునకు విశాఖలోని 20 ఆస్తులను బదలాయించాలని వారం క్రితం ఉత్తర్వులిచ్చింది. తదనుగుణంగా 15 ఆస్తుల జాబితాను జిల్లా యంత్రాంగం పంపింది. వాటిని పూచీకత్తుగా పెట్టి ఏపీఎస్డీసీ రుణాలు పొందనుంది.
పురాతన కట్టడాలైన కలెక్టరేట్, గవర్నర్ బంగ్లా, టర్నర్ చౌల్ట్రీ సహా అనేక భవనాలను బదలాయించాలని భావించినా... తీవ్ర వ్యతిరేకత రావటంతో జిల్లా అధికారులు వెనక్కి తగ్గారు. బిల్డ్ ఏపీ కింద అమ్మకానికి పెట్టిన జిల్లా శిక్షణ కేంద్రం భవన సముదాయం, పశుసంవర్ధకశాఖ ఉద్యోగుల సహకార సంఘానికి కేటాయించిన స్థలాలపైనా దుమారం రేగటంతో వాటిని ప్రతిపాదనల నుంచి తప్పించారు. బక్కన్నపాలెంలో సెరికల్చరల్ శాఖ, దివ్యాంగుల శాఖ, డెయిరీఫారం వద్ద ఉన్న పశుసంవర్ధకశాఖ భూములు ఈ ప్రతిపాదనల్లో ఉన్నాయి.