Government Offices Shifting to Visakhapatnam : ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో విశాఖకు మకాం మార్చడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్ని తరలించడం ముమ్మాటికీ కోర్టు తీర్పును ఉల్లంఘించడమేనని.. న్యాయనిపుణులు, IASలు చెబుతున్నారు. అమరావతే రాజధాని అని, ఏవంకతోనూ కార్యాలయాలను అక్కడి నుంచి తరలించవద్దని హైకోర్టు స్పష్టం చేసిందని, దానిపై సుప్రీంకోర్టు కూడా స్టే ఇవ్వలేదని గుర్తు చేశారు. అలాంటప్పుడు దొడ్డిదారిన విశాఖకు ఎలా వెళ్తారని ప్రశ్నిస్తున్న వారు.. అంతిమంగా కోర్టులో ఎదురుదెబ్బలు తప్పవని తేల్చిచెబుతున్నారు.
Violation of Government Offices in Visakhapatnam :కోర్టుల్ని, చట్టాల్ని ధిక్కరించి, దొంగ జీవోలతో దొడ్డిదారిన రాజధానిని విశాఖకు మార్చేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధపడటం ముమ్మాటికీ కుట్రేనని.. పలువురు స్పష్టం చేస్తున్నారు. రాజధాని అమరావతేనని, అక్కడి నుంచి ప్రభుత్వ కార్యాలయాల్ని తరలించవద్దని హైకోర్టు స్పష్టంగా తీర్పు చెప్పినా ప్రభుత్వం వక్రబుద్ధి వీడలేదని ఆక్షేపిస్తున్నారు. హైకోర్టు తీర్పు వెలువడిన రోజే అడ్వొకేట్ జనరల్, పలువురు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. మూడు రాజధానులపై ముందుకే వెళ్లాలని నిర్ణయించడం, ఇప్పుడు ఆచరణలోకి తేవడం కోర్టులంటే కనీస గౌరవం లేదని స్పష్టమవుతోందని చెబుతున్నారు.
కేవలం అమరావతిపై కక్షతో దొడ్డిదారిన విశాఖకు రాజధానిని మార్చేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని దానికి ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం అనే ముసుగుని తొడిగిందని తెలిపారు. ప్రభుత్వం కోర్టుల్ని కూడా రాజకీయ ప్రత్యర్థుల్లా చూస్తోందని, కోర్టు తీర్పులకు వక్రభాష్యాలు చెబుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఉత్తర్వుల ఉల్లంఘనలకు బాధ్యులైన ప్రతి అధికారీ కోర్టులో దోషులుగా నిలబడాల్సిందేనని వృథా చేసిన ప్రతి పైసాకి జవాబు చెప్పాల్సిందేనని వారు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వం ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం, మావోయిస్టుల ప్రభావం వంటి కబుర్లు చెప్పి దొడ్డిదారిన విశాఖకు కార్యాలయాల్ని తరలించడం కోర్టును మోసపుచ్చడమేనని హైకోర్టు న్యాయవాది ఉన్నం మురళీధర రావు అన్నారు. అందుకు జీవోలిచ్చిన సీఎస్ జవహర్ రెడ్డి, ఇతర అధికారులు ఏదో ఒకరోజు కోర్టుకొచ్చి బోనులో నిలబడాల్సి వస్తుందన్నారు. జగన్ ప్రభుత్వం తీరు రాజ్యాంగాన్ని, చట్టాల్ని అమలు చేయాల్సిన ప్రభుత్వం వ్యవహరించాల్సినట్లు లేదని... ఇది బాధ్యత గల ప్రభుత్వమా? ప్రైవేటు లిటిగెంటా? అన్న అనుమానం వస్తోందని హైకోర్టు న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు.