బీచ్‌రోడ్డులో 13.59 ఎకరాలు.. ఇది ఏపీఐఐసీకి చెందిన అత్యంత విలువైన భూమి. దీంతో సహా మొత్తం 18 ఆస్తుల విక్రయానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది. విశాఖపట్నంలోని పలు కీలక ప్రాంతాల్లో ఉన్న ఈ భూములను రాష్ట్ర ప్రభుత్వం తరఫున విక్రయించడానికి కేంద్రప్రభుత్వ నవరత్న సంస్థ ఎన్‌బీసీసీ (నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్) ప్రకటన విడుదల చేసింది. నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన బీచ్‌రోడ్డులో మార్గాన్ని అనుకుని ఉన్న 18 ఎకరాల స్థలంలో లూలూ సంస్థ భారీ కన్వెన్షన్ కేంద్రంతోపాటు మాల్ తదితరాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వంతో గతంలో ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం ఆ ఒప్పందం నుంచి లూలూ సంస్థ వైదొలగడంతో ఆ స్థలం ప్రభుత్వపరమైంది. తాజాగా ఆ భూమికి ఎన్‌బీసీసీ సంస్థ రూ.1,452 కోట్ల రిజర్వు ధరను నిర్ణయించింది. మిగిలిన మరో 17 స్థలాలనూ అమ్మకానికి పెట్టారు. ఆయా స్థలాలను విక్రయించడానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే దరఖాస్తులను ఆహ్వానించింది.
విశాఖలో అమ్మకానికి ప్రభుత్వ భూములు - vishakha latest news
విశాఖలో బీచ్ రోడ్డులో ఉన్న ప్రభుత్వ భూమి అత్యంత ఖరీదైంది. ఆ భూమి అమ్మకానికి ప్రభుత్వం సిద్ధమైంది. నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ వేలానికి సంబంధించిన ప్రకటనను విడుదల చేసింది. ఈ స్థలాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే దరఖాస్తులను ఆహ్వనించగా.. తాజాగా ఆ ప్రక్రియ ఊపందుకుంది.
తాజాగా ఎన్‌బీసీసీ సంస్థ ఆయా భూములు, స్థలాల ఫొటోలు, లేఅవుట్ కాపీలు, ప్లాట్ నెంబర్లు, మ్యాప్‌లు, నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఆయా స్థలాలు ఎంతదూరంలో ఉన్నాయి? తదితర అంశాలన్నింటినీ పొందుపరుస్తూ సమగ్ర వివరాలను అంతర్జాలంలో పొందుపరచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ‘మిషన్ బిల్డ్ ఏపీ’ కింద కొన్ని స్థలాల్ని విక్రయించాలని నిర్ణయించిందని, ఆయా స్థలాలకు ప్రభుత్వం తరఫున తాము ఈ-వేలం నిర్వహిస్తున్నామని తెలిపింది. కొనాలనుకునేవారి కోసం దరఖాస్తు ఫారాన్ని కూడా అందుబాటులో ఉంచింది. ఈ నెల 22వ తేదీ ఉదయం 11గంటలలోపు ప్రీబిడ్ ఇ.ఎం.డి. సమర్పించాలని సూచించింది. ఆ సమయానికి 48 గంటల ముందే ఇ.ఎం.డి. (ముందస్తుగా చెల్లించే మొత్తం) జమ చేయాలని పేర్కొంది. అవగాహనకు నమూనా ఈ-వేలాన్ని ఈనెల 19 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ-వేలం నిబంధనలు, సమర్పించాల్సిన పత్రాల నమూనాలనూ దరఖాస్తు ఫారంలో పొందుపరచింది.
ఇదీ చదవండి:డాక్టర్ సుధాకర్ కేసు: హైకోర్టుకు సీబీఐ నివేదిక సమర్పణ