dasapalla land issue: 'దసపల్లా భూములు రాణి కమలాదేవికి చెందినవని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. అది ప్రభుత్వ భూమి కాదు. ప్రైవేటు భూమి అయినప్పుడు.. నిషేధిత భూముల జాబితా 22A నుంచి తీసేయడంలో తప్పేముంది.. సుప్రీం తీర్పు అమలు చేయకపోవడం తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యం. దాన్ని అమలు చేసిన ఘనత మా ప్రభుత్వానికే దక్కుతుంది. దసపల్లా భూముల్ని ఆక్రమించుకుని ఇళ్లు కట్టుకున్నవారు 400 మంది.. ప్లాట్ల యజమానులు 64 మంది ఉన్నారు. ఆ 400 ఇళ్లను ఇప్పుడు కూలగొట్టగలమా.. అన్ని దారులూ మూసుకుపోయాక మా ప్రభుత్వం వచ్చింది. 400 కుటుంబాలు బాగుపడతాయని.. 64 మంది స్థలాల యజమానులకు మేలు జరుగుతుందని మేం క్లియర్ చేశాం'.. ఇవీ.. తీవ్ర చర్చనీయాంశమైన విశాఖ దసపల్లా భూముల కుంభకోణంపై ప్రభుత్వం చేయగలిగిందేమీ లేదని చేతులెత్తేస్తూ.. స్థల యజమానులుగా చెబుతున్నవారికి మద్దతుగా వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి.. ఇటీవల చేసిన వ్యాఖ్యలు.
ఆ భూముల్ని ప్రైవేటు వ్యక్తుల పరం చేసేందుకు కలెక్టర్ సహా అధికార యంత్రాంగమంతా ఎక్కడలేని ఉత్సాహం చూపిస్తోంది. మరో పనేమీ లేదన్నట్లు.. దసపల్లా భూముల్ని విజయసాయిరెడ్డి కుమార్తె, అల్లుడి కంపెనీతో సంబంధాలు ఉన్నాయని , అత్యంత సన్నిహితులని ఆరోపణలు ఉన్న వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు జిల్లా అధికారులు ఉవ్విళ్లూరుతున్నారు. సాయిరెడ్డి చెప్పినట్టు దసపల్లా భూములకు ప్రభుత్వం నీళ్లొదులుకోవాల్సిందేనా..? న్యాయపోరాటానికి అవకాశమే లేదా..?
కొన్నేళ్ల క్రితం తిరుమల కొండపై టీటీడీకి చెందిన 28.93 ఎకరాల భూమిపై తమకే రైత్వారీ పట్టా ఉందంటూ తాళ్లపాక కుటుంబం సుప్రీంకోర్టు వరకు వెళ్లి కేసు గెలిచింది. అయితే ఆ భూములు శ్రీవారికే చెందుతాయని సుదీర్ఘ న్యాయపోరాటం చేసి మరీ..టీటీడీ గెలిచింది. అదే తరహాలో దసపల్లా భూములపైనా ప్రభుత్వం న్యాయ పోరాటం చేసేందుకు ఇప్పటికీ అవకాశాలు ఉన్నాయని.. ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు వంటి విశ్రాంత ఐఏఎస్ అధికారులు చెబుతున్నా.. ప్రభుత్వానికి ఎందుకు చెవికి ఎక్కడం లేదో తెలియడం లేదు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక కూడా దసపల్లా భూములు ప్రభుత్వానివేనంటూ... అప్పటి జిల్లా కలెక్టర్ యువరాజ్ వాటిని 22Aలో పెట్టారు. ఆ తర్వాత వచ్చిన కలెక్టర్లూ అదే జాబితాలోనే కొనసాగించారు. వారెవరికీ లేని తొందర ప్రస్తుత కలెక్టర్‌కే ఎందుకో అర్థం కావడం లేదు. ఎంపీ సాయిరెడ్డి సన్నిహితులకు ఆ భూములు కట్టబెట్టేందుకేనా ఆత్రుత అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
దసపల్లా భూముల వ్యవహారానికి.. టీటీడీ కేసుకు సారూప్యం ఉందని తెలీడంతో అప్పటి కేసుపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. తిరుమల కొండపై ఉన్న భూములకు సంబంధించి బ్రిటిష్ ప్రభుత్వమే టీటీడీకి టైటిల్ డీడ్ ఇచ్చింది. 1960 జనవరి 24న ఈనాం డిప్యూటీ తహసీల్దారు టీటీడీకి రైత్వారీ పట్టా ఇవ్వగా.. 10.33 చదరపు మైళ్ల ప్రాంతం టీటీడీకి చెందుతుందంటూ 1965 నవంబరు 4న కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇందులో 2920, 2921 నెంబర్ల టైటిల్ డీడ్‌లకు చెందిన 28.93 ఎకరాలపై ఈనాంల రద్దు చట్టం ప్రకారం తమకే రైత్వారీ పట్టా ఉందంటూ... 1982 ఆగస్టులో సర్వే సెటిల్‌మెంట్ కమిషనర్‌కు తాళ్లపాక కుటుంబం రివ్యూ పిటిషన్ సమర్పించింది.
ఈనాం డిప్యూటీ తహసీల్దార్, ఆర్డీవోతోపాటు సర్వే సెటిల్‌మెంట్ కమిషనర్ కూడా..ఆ భూములు తాళ్లపాక కుటుంబానికే చెందుతాయని ఉత్తర్వులిచ్చారు. హైకోర్టు ఫుల్‌బెంచ్, సుప్రీంకోర్టు కూడా అదే చెప్పాయి. అయితే..ఆ 29.93 ఎకరాల భూమికి టైటిల్ టీటీడీ పేరిట ఉందంటూ అప్పటి జేఈవో బాలసుబ్రహ్మణ్య సబ్‌కోర్టులో.. సివిల్ కేసు వేసి సంబంధిత సాక్ష్యాలు చూపించారు. ఈ కేసుపై విచారణ జరపకుండా.. తాళ్లపాక కుటుంబం హైకోర్టుకెళ్లి స్టే తెచ్చుకుంది. ‘ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్’ కింద ఆ భూములు టీటీడీకి చెందుతాయని, సంబంధిత పత్రాలన్నీ ఉన్నాయని బాలసుబ్రహ్మణ్యం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో టీటీడీ సిబ్బంది కొందరు తాళ్లపాక కుటుంబంతో కుమ్మక్కై ఆ పత్రాల్ని కోర్టు దృష్టికి తీసుకురాలేదని, మోసం జరిగిందని వివరించారు.