విశాఖ జిల్లాలో మరో 50 ఇసుక రీచ్లు ఏర్పాటు చేయడానికి అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈనెల 25 నుంచి నివాస స్థలాల పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టగా.. తరువాత ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకూ ప్రణాళికలు రూపొందించింది. పేదలకు గృహాల నిర్మాణానికి కనీసం 5 లక్షల టన్నుల ఇసుక అవసరమవుతుందని అంచనా. పొరుగు జిల్లాల నుంచి ఇసుక కొనుగోలు చేసే స్తోమత.. గ్రామీణ ప్రాంత లబ్ధిదారులకు లేదని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలోని నదులు, వాగులు, కాలువల్లో ఇసుక లభ్యత మేరకు తవ్వకాలకు అనుమతులు ఇవ్వడానికి ప్రతిపాదిస్తున్నారు. ఇప్పటికే శారదానది, బొడ్డేరు, తాండవ, గోస్తినీ తదితరాల్లో అనుమతులు మంజూరుకు యోచిస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు అధికంగా కురవగా.. ఆయా నదుల్లో ఇసుక లభ్యత ఆశాజనకంగా ఉంటుందని భావిస్తున్నారు.
అసలేంటి సమస్య?
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక సేకరణకు సంబంధించి నూతన విధానాన్ని అమలులోకి తీసుకు వచ్చింది. ఇందులో భాగంగా జిల్లాలోని నర్సీపట్నం, అనకాపల్లి, ముడసర్లోవ, చోడవరం, నక్కపల్లి, అగనంపూడి, అచ్చుతాపురం తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ ఇసుక డిపోలను ఏర్పాటు చేశారు. తొలిరోజుల్లో ఈ ప్రక్రియ కాస్త ఆశాజనకంగా ఉన్నా.. అనంతరం పలు ఆరోపణలు ఊపందుకున్నాయి. కొన్నిచోట్ల వేలాది టన్నుల ఇసుక మాయమైన ఘటనలపై.. తెదేపా నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వ డిపోల్లో ఇసుక కొరత ఏర్పడింది.
నిబంధనలు ఎలా ఉన్నాయి?
స్థానిక రీచ్ల నుంచి ఇసుక తరలింపునకు పలు నిబంధనలు ఉన్నాయి. సొంత అవసరాలకు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ఇసుకను ఉచితంగా తీసుకువెళ్ళవచ్చు. కానీ గ్రామ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. ఇతర అవసరాలకు రవాణా చేసినట్లయితే.. ట్రాక్టర్ యజమాని టన్నుకు రూ. 375 చొప్పున సచివాలయంలో చెల్లించి రశీదు పొందాలి. ఎడ్లబండ్ల విషయంలో ఆంక్షలు పెట్టకూడదని ఇటీవల అధికారులు నిర్ణయించగా.. అమల్లోకి రావడానికి కొంత సమయం పడుతుందని ఉన్నతాధికారులు సూచనప్రాయంగా తెలియజేస్తున్నారు.