మహిళలు ఆర్థిక స్వావలంభన సాధించడానికి వివిధ పథకాల ద్వారా సర్కారు చేయూతనిస్తోంది. తాజాగా వ్యాపార రంగంలో రాణించడానికి తోడ్పాటు అందించబోతుంది. ముందుగా విశాఖ జిల్లా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలు నిర్వహించే వ్యాపారాల్లో వృద్ధి సాధించడానికి నేరుగా బహుళజాతి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఉత్పత్తుల తయారీ నుంచి మార్కెటింగ్ వరకు.. ఆయా సంస్థలు మహిళలకు తోడుగా నిలవనున్నాయి. పొదుపు మహిళలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రభుత్వం, కంపెనీలు ఆర్థికంగా, సాంకేతికంగా సహయపడనున్నాయి. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను డీఆర్‌డీఏ అధికారులు సిద్ధం చేశారు. ఇతర ప్రభుత్వ శాఖలను ఇందులో భాగస్వాములను చేస్తున్నారు. జీవీఎంసీ, పురపాలక, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో 70 వేలకు పైగా స్వయం సహాయక సంఘాలున్నాయి. ఏటా రూ. వెయ్యి కోట్ల నుంచి రూ. 1,300 కోట్లు బ్యాంకు లింకేజీ రూపంలో వీరికి రుణాలు అందిస్తున్నారు. ఈ ఏడాది వడ్డీలేని రుణాలను అందుబాటులోకి తెచ్చారు. ఇటీవల 1.82 లక్షల మంది మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.18,750 చొప్పున రూ.349 కోట్లు ఆర్థిక సాయం అందజేశారు. తాజాగా వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా తొలివిడతగా 6.61 లక్షల మందికి రూ.459 కోట్లు రుణమాఫీ చేశారు. ఇంత పెద్దమొత్తంలో ఆర్థిక ప్రయోజనం పొందుతున్న మహిళలు.. వాటిని సరైన రీతిలో సద్వినియోగం చేసుకుంటే మరింత ప్రగతిని సాధించడానికి అవకాశం ఉందని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే మహిళలు వ్యాపార రంగంలో పట్టు సాధించడానికి అవసరమైన సలహాలు, సాంకేతిక పరమైన సహకారం అందించడానికి బహుళజాతి సంస్థల (ఎమ్‌ఎన్‌సీ)తో ఒప్పందం చేసుకుంది. ఇటీవలే ఆయా సంస్థల ప్రతినిధులతో డీఆర్‌డీఏ అధికారులు కార్యశాల నిర్వహించారు. జిల్లాలో పొదుపు మహిళలు చేపడుతున్న వ్యాపారాలను వివరించి.. తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎమ్‌ఎన్‌సీలకు సూచించారు.
రిటైల్ దుకాణాలపైనే ఆసక్తి..
ఇటీవల చేయూత పథకం ద్వారా లబ్ధిపొందిన మహిళలలో 21,358 మంది.. రిటైల్ దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి చూపించారు. వీరికి తొలివిడతగా రూ.18,750 సాయం అందింది. దుకాణ ఏర్పాటుకు ముందుకు వస్తే మిగతా రూ.56,250 రుణంగా అందిస్తున్నారు. ఇప్పటికే 150కి పైగా కిరాణా దుకాణాల నిర్వహణకు సాయం అందజేశారు. పాడి పశువులు, గొర్రెలు, మేకలు కొనుగోలుతో పాటు, విస్తర్లు, పచ్చళ్ల తయారీ, మత్స్య ఉత్పత్తులు, ఏటికొప్పాక బొమ్మల తయారీ ఇతర ఉపాధి అవకాశాలపై ఆసక్తి చూపించే వారిని గుర్తిస్తున్నారు. వారందరికీ ముడిసరకును సమకూర్చడంతో పాటు మార్కెటింగ్ ఏ విధంగా చేయాలనే విషయమై సంబంధిత కంపెనీలే బాధ్యత తీసుకోనున్నాయి.