విశాఖ నగరానికి సమీపాన ప్రకృతి సోయగాల మధ్య ఉండే ప్రాంతం 'యారాడ'. ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రాంతమంటే ఎంతో ఇష్టం. అంతటి సుందరమైన ఈ తీర ప్రాంతంలో ఎప్పటికీ నీటి సమస్యనే ఉత్పన్నం కాదు. సాధారణంగా సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో లభించే నీరు ఉప్పగా ఉంటుంది. తాగేందుకు సాధ్యం కాదు. కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి పూర్తి భిన్నం. యారాడలో లభించే నీరు మాత్రం తియ్యగా ఉంటుంది.
నీటి సంరక్షణలో ఆదర్శంగా.. యారాడ - yarada
ఆ గ్రామవాసులకు నీటి సమస్య అనే మాట తెలియదు. ఏడాది పాటు కావాల్సినంత నీరు లభిస్తోంది వారికి. సాగర తీరానికి కూతవేటు దూరంలోనే ఉన్న ఆ గ్రామంలో... నీరు మాత్రం చక్కెరంత తియ్యగా ఉంటుంది. ప్రకృతి సొబగుల నడుమ, పచ్చదనాన్ని పరుచుకున్న యారాడ... నీటి సంరక్షణతో ఆదర్శంగా నిలుస్తోంది.
యారాడలో 9 వందల ఇళ్లు ఉండగా... 15 వందల మందికి పైగా నివాసం ఉంటున్నారు. ప్రతి ఇంటికి బావుల్లోని నీటిని కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్నారు. అలా సరఫరా చేసిన నీటిని... సాగు, తాగు అవసరాల కోసం వినియోగిస్తుంటారు. నీటిలో ఏ విధమైన ఉప్పు లక్షణాలు కనిపించవని... అన్నింటికీ ఈ నీటినే వినియోగిస్తారని స్థానికులు చెబుతున్నారు. పర్యావరణం కూడా నీటి రుచికి కారణమని అంటున్నారు. వర్షం కురిసినప్పడు ప్రతి నీటి బొట్టును భూమిలోకి ఇంకేలా యారాడలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఫలితంగా వేసవి కాలంలోనూ పుష్కలంగా నీరు దొరుకుతుందని యారాడ వాసులు చెబుతున్నారు.