RK BEACH ROAD: విశాఖ అనగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది ఆర్కే బీచ్. ఎక్కువ శాతం మంది పర్యాటకులు దీనిని సందర్శించి కొద్దిసేపు సేద తీరుతారు. బీచ్ ప్రదేశంలో ఉదయం, సాయంత్రం వేళల్లో పలు కార్యక్రమాలు జరుగుతుంటాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 కారణంగా బీచ్‌రోడ్డు రానున్న రోజుల్లో తన కళ కోల్పోతుందేమోననే చర్చ సాగుతోంది.
చర్చనీయాంశంగా జీవో నంబరు 1 పరిణామాలు:రాజకీయ పార్టీల సమావేశాలు, క్రీడా సంబరాలు, నడక పోటీలు, మారథాన్‌లు, ప్రజా ఉద్యమాలు, కార్మిక సంఘాల మహాసభలు, సినీ రంగంతో పాటు పలు సంస్థల వేడుకలు నిర్వహిస్తారు. ఇక్కడికి వచ్చే వేలాది మందికి తమ సందేశం చేరువవుతుందని విశ్వసిస్తారు. గత కొన్నేళ్లుగా సినిమా వేడుకలకు బీచ్‌రోడ్డు కేంద్ర బిందువుగా మారింది. చిన్న కార్యక్రమాలైతే బీచ్‌రోడ్డు పక్కన ఉన్న కొన్ని ఖాళీ స్థలాల్లో... పెద్దవైతే బీచ్‌లో నిర్వహిస్తూ వచ్చారు. అలాంటప్పుడు పోలీసులు చర్యలు చేపట్టి రాకపోకలు నిషేధించడం, ఒక్కోసారి పాక్షికంగా ఒక వరుసలో వాహనాలు అనుమతిచండం చేసేవారు.
*రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నెంబరు 1 కారణంగా బీచ్‌రోడ్డు రానున్న రోజుల్లో తన కళ కోల్పోతుందేమోననే చర్చ సాగుతోంది. వేదికలు ఏర్పాటు చేసి సమావేశాలు నిర్వహించకూడదని పేర్కొనడంతో... నగరంలో తొలిసారి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా వేడుకపై ఆ ప్రభావం పడడం కూడా చర్చనీయాంశంగా మారింది. బీచ్‌రోడ్డులో సినిమా వేడుక నిర్వహించడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావించిన నిర్వాహకులు నగర పోలీసుల నిర్ణయం ఊహించలేదు.
*బీచ్‌రోడ్డులో వేదికను కొంత వరకు ఏర్పాటు చేసినప్పటికీ తరువాత దాన్ని ఎ.యు. ఇంజినీరింగ్ కళాశాల క్రీడామైదానానికి మార్చుకోవాల్సిందేనని పోలీసులు సూచించడంతో అలా చేయక తప్పలేదు. వాస్తవానికి నిర్వాహకులు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఏయూ క్రీడామైదానానికీ దరఖాస్తు చేసుకోవడంతో కార్యక్రమం సజావుగా జరిగింది.