Global Tech Summit: విశాఖలో వచ్చే నెల 3,4 తేదీలలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు రాష్ట్ర భవిష్యత్తుకు మంచి బాటలు వేస్తుందని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. కాస్మోపాలిటన్ సిటీగా పేరొందిన ఈ నగరం ఐటీతోపాటు, ఇతర పరిశ్రమల స్థాపించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఐటీ విభాగంలో శిక్షణ పొందిన యువకులకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందన్నారు.
పల్సస్ ఐటీ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి దేశంలోని పలు ప్రధాన నగరాలలో గ్లోబల్ టెక్ సమ్మిట్లు నిర్వహిస్తోంది. విశాఖలో రెండు రోజులు పాటు నిర్వహించనున్న గ్లోబల్ టెక్ సమ్మిట్ కి వివిధ విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సదస్సులో మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ, దేశ విదేశాల్లోని దిగ్గజ ఐటీ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు. ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు విశాఖలో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, వచ్చే రెండు నెలల్లో ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు ఇక్కడ నుంచి విధులు నిర్వహించే అవకాశం ఉందన్నారు. విశాఖపట్నం, తిరుపతి అనంతపురంలలో ఇప్పటికే ఐటీ పార్కులను ఏర్పాటు చేశామని, భోగాపురంలో త్వరలోనే కొత్త ఐటీ పార్క్ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. విశాఖలోని ఋషికొండ వద్ద ఏర్పాటయ్యే అధాని డేటా సెంటర్ కి సీఎం జగన్ వచ్చే నెల మూడవ తేదిన శంకుస్థాపన చేయనున్నారన్నారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ, ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యమని , ఏపీ డిజిటల్ హెల్త్ కేర్ లో విప్లవాత్మక మార్పులకి నాంది కాబోతోందన్నారు. టెక్నాలజీ సహకారంతో రోగులకు మెరుగైన వైద్యం అందించడానికి అవకాశాలు ఉన్నాయన్న ఆమె డిజిటల్ హెల్త్ కేర్ ద్వారా మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు చేరుతాయని వివరించారు.