విలువైన భూములన్నీ శివారు ప్రాంతాల్లో ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా మార్పులను సులభంగా గుర్తించేలా జీఐఎస్ (భౌగోళిక సమాచార విధానం) ఉపయోగించుకోనున్నారు. ఇప్పటికే వీఎంఆర్‌డీఏ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి సర్వే ప్రారంభించగా 200 ఎకరాలకు పూర్తిచేశారు. కొన్నేళ్ల కిందటే ప్రభుత్వం వీఎంఆర్‌డీఏకు పదివేలకు పైగా ఎకరాలు అప్పగించింది. వాటిలో చాలా వరకు వినియోగించుకోగా మూడు వేల ఎకరాలు ఖాళీగా ఉంది.
ప్రస్తుతం ఆ భూముల్లో కొండలు, గుట్టలు, చెరువులు, గెడ్డలు, రోడ్లు, కాలువలు ఉండడంతో వీటిల్లో ఎంత భూమి ఉపయోగపడుతుందో తేలాలి. వీఎంఆర్‌డీఏకు ఖాళీగా ఉన్న భూములన్నీ మధురవాడ, శొంఠ్యాం, కాపులుప్పాడ, చిట్టివలస, కొమ్మాది, ఆనందపురం, గిడిజాల, యారాడ తదితర ప్రాంతాల్లో ఉన్నాయి.
ఏ మార్పు జరిగినా గుర్తించేలా!
వీఎంఆర్‌డీఏ పరిధిలోని భూములకు మొదట సర్వే నిర్వహించి జీపీఎస్ ట్రాకింగ్ తీసుకొని మండల సర్వేయర్ ఆమోదంతో వివరాలు వెబ్‌ల్యాండ్‌లో ఉంచనున్నారు. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో తమ భూమి ఎక్కడ ఎంతవరకు ఉందో సులభంగా గుర్తించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా భౌతికంగా గుర్తించేందుకు వీలుగా ప్రత్యేక హద్దు రాళ్లు ఏర్పాటు చేయించనున్నారు. మూడు అడుగుల కింద పైన నాలుగు అడుగులు కనిపించేలా వీటిని ఏర్పాటు చేయనున్నారు. వీటికి సంబంధించిన టెండర్లు ఇప్పటికే పిలిచారు.
వీఎంఆర్‌డీఏకు చెందిన భూముల సర్వే వివరాలు తీసుకొని జీఐఎస్ విధానంలో ఉపగ్రహ ఛాయాచిత్రాలతో ఎప్పటికపుడు మార్పులు తెలుసుకునేలా చేయనున్నారు. ఇందుకోసం జాతీయ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ సహకారంతో ఉపగ్రహ చిత్రాలు తీసుకొని ఈఎస్‌ఆర్‌ఐ (ఎన్విరాన్‌మెంటల్ సిస్టం రీసెర్చ్ ఇనిస్టిట్యూట్) సాఫ్ట్‌వేర్ సాయంతో మార్పులను కచ్చితంగా తెలుసుకోనున్నారు. దీంతో ఎక్కడైనా ఆక్రమణ జరిగినా, గుంతలు తీసినా, స్తంభాలు పాతినా స్పష్టంగా తెలిసిపోతుంది.
ప్రతి పదిహేను రోజులకు ఉప్రగ్రహం పంపించే చిత్రాల్లోని మార్పులను కంప్యూటర్‌లోని సాఫ్ట్‌వేర్‌తో గుర్తించొచ్చు. ఆ తరువాత వెంటనే చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే సాఫ్ట్‌వేర్ కొనుగోలుకు సంబంధించిన సంప్రదింపులు పూర్తయ్యాయి. మొత్తం అందుబాటులో ఉన్న స్థలాలకు సర్వే పూర్తి చేసి జీఐఎస్ విధానంలో సంరక్షించనున్నారు.
2017 నాటికి కోర్టు వివాదాలు, ఆక్రమణల్లో 617 ఎకరాలు గుర్తించగా ఆ తరువాత కొన్నింటిని పరిష్కరించుకోవడంతో సుమారు వంద ఎకరాల వరకు కాపాడుకున్నారు. సుమారు అయిదొందల ఎకరాల భూమి కోర్టు వివాదాల్లో నేటికీ కొనసాగుతోంది. హైకోర్టులో పెండింగులో ఏఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకొని తదుపరి చర్యలు తీసుకునేందుకు న్యాయవిభాగ అధికారులు సిద్ధమవుతున్నారు.
వీఎంఆర్‌డీఏ పరిధిలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న భూమి (ఎకరాల్లో)