ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యాపారులపై చెత్త పన్ను పిడుగు.. పాత బకాయిలతో సహా చెల్లించాలని ఆదేశం - వ్యాపారులపై చెత్త పన్ను తాజా వార్తలు

Garbage Tax: పాత బకాయిలతో సహా చెత్త పన్ను చెల్లించాలని పుర, నగరపాలక సంస్థలు తాఖీదులు జారీ చేయడంతో వ్యాపారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇళ్లు, దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల నుంచి చెత్త సేకరిస్తున్నందుకు రుసుములు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.. కానీ..?

వ్యాపారులపై చెత్త పన్ను
వ్యాపారులపై చెత్త పన్ను

By

Published : Jan 4, 2023, 11:56 AM IST

Garbage Tax: పాత బకాయిలతో సహా చెత్త పన్ను చెల్లించాలని పుర, నగరపాలక సంస్థలు తాఖీదులు జారీ చేయడంతో వ్యాపారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు.. నెలకు రూ.500 నుంచి రూ.1,000 వరకు చెల్లించాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. పెద్ద వ్యాపార సంస్థల నుంచైతే నెలకు రూ.10,000 నుంచి రూ.15,000 వరకు వసూళ్లకు తాఖీదులిస్తున్నారు. పాత బకాయిలతో కలిపి భారీగా లెక్కలు చూపిస్తున్నారు.

ఇళ్లు, దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల నుంచి చెత్త సేకరిస్తున్నందుకు రుసుములు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనలను కొన్ని చోట్ల పాలకవర్గాలు యథాతధంగా ఆమోదించాయి. ఇంకొన్ని చోట్ల ప్రతిపాదిత రుసుములపై కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఇళ్ల నుంచి చెత్త పన్ను వసూళ్లపై పలు చోట్ల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

చెత్త పన్ను వసూళ్లలో ఇప్పటివరకు ఆచితూచి వ్యవహరించిన పట్టణ స్థానిక సంస్థలు ప్రస్తుతం వ్యాపారుల నుంచి పాత బకాయిలతో సహా రాబట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఉదాహరణకు విజయవాడలోని బీసెంట్‌ రోడ్డులో పండ్ల రసాల షాపు నిర్వాహకుడికి రూ.2,400 చెత్త పన్ను చెల్లించాలని నగరపాలక సంస్థ తాఖీదు పంపింది. నెలకు రూ.300 చొప్పున 8 నెలలకు బకాయిలతో సహా వెంటనే జమ చేయాలని అధికారులు ఆదేశించారు.

వ్యాపారం అంతంత మాత్రంగా ఉండటంతో దుకాణం అద్దె, విద్యుత్తు ఛార్జీలు చెల్లించేందుకే చాలా ఇబ్బందులు పడుతున్నామని దుకాణం నిర్వాహకుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో ఓ చికెన్‌ షాపు నిర్వాహకుడికి 10 నెలలకు చెత్త పన్ను కింద రూ.3వేలు చెల్లించాలని నగరపాలక సంస్థ ఉద్యోగులు హుకుం జారీ చేశారు. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఒక మిఠాయి దుకాణం నిర్వాహకుడి నుంచి చెత్త పన్ను కింద నెలకు రూ.1,050 చొప్పున వసూలు చేశారు.

విశాఖలో మూడు నెలలుగా మూతపడి ఇటీవల తెరిచిన ఒక చేపల దుకాణానికి చెత్త పన్ను 4 నెలలకు కలిపి రూ.800 చెల్లించాలని తాఖీదులిచ్చారు. దుకాణం మూతపడినా పన్ను కట్టాల్సిందేనని ఒత్తిడి తెస్తున్నారు. ఇదే ప్రాంతంలో వ్యాపారం సాగక 6 నెలలుగా మూతపడిన మరో గోడౌన్‌కు పాత బకాయిలతో సహా రూ.7,500 చెల్లించాలని తాఖీదు పంపారు.

విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో కొన్ని స్టార్‌ హోటళ్లు, సినిమా థియేటర్ల నిర్వాహకులకు చెత్త పన్ను పేరుతో నగరపాలక సంస్థలు చుక్కలు చూపిస్తున్నాయి. 5-7 నక్షత్రాల హోటళ్ల నుంచి నెలకు రూ.15వేలు, త్రీ స్టార్‌ హోటళ్లల నుంచి రూ.10వేలు వసూలు చేస్తున్నారు. సినిమా థియేటర్లలో తెరకు (స్క్రీన్‌) రూ.2,500 చొప్పున రాబడుతున్నారు. 2021 అక్టోబరు నుంచి చెత్త పన్ను కొన్ని పట్టణ స్థానిక సంస్థల్లో అమలులోకి వచ్చింది. వీటిని చెల్లించని వారి నుంచి బకాయిలతో సహా ప్రస్తుతం వసూలు చేస్తున్నారు. ఇలాంటి వ్యాపార సంస్థలకు రూ.లక్షల్లో తాఖీదులు వెళ్లడంతో వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు.

అపరాధ రుసుముల పేరుతోనూ బెదిరింపులు..చెత్త పన్ను ప్రతి నెలా చెల్లించకపోతే అపరాధ రుసుములు విధిస్తామని పుర, నగరపాలక సంస్థల అధికారులు వ్యాపారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కొన్ని చోట్ల పాత బకాయిలపై అపరాధ రుసుము విధించకపోయినా.. ఇప్పుడు చెల్లించకపోతే తదుపరి ఇచ్చే తాఖీదులు అపరాధ రుసుములతో కలిపి వస్తాయని హడలెత్తిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details