విశాఖ ఏజెన్సీ నుంచి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా గంజాయిని చేరవేస్తున్న ఇద్దరు యువకుల్ని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ జిల్లా పెద బయలు గ్రామానికి చెందిన డేవిడ్ రాజు, చిరంజీవి, బాలాజీ అనే ముగ్గురు యువకులు గంజాయి రవాణా ద్వారా వచ్చే డబ్బులకు అలవాటుపడ్డారు. బాగా చదువుకున్నప్పటికీ.. గంజాయిని ఇతర రాష్ట్రాలకు చేరవేస్తే వచ్చే అధిక ఆదాయం వస్తుందన్న ఆలోచనతో గంజాయి తరలింపు చేపడుతున్నారు.
ఇటీవల కాలంలో పోలీసుల తనిఖీలు ఎక్కువగా నిర్వహిస్తుండడంతో.. పోలీసులకు అనుమానం రాకుండా నూతన పద్ధతిలో లిక్విడ్ గంజాయిని తరలించేందుకు శుక్రవారం ప్రయత్నించారు. విశాఖ నగరంలో కంచరపాలెం వద్ద వాటిని తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. రూ.14 లక్షల విలువైన 7 కిలోల లిక్విడ్ గంజాయి, రెండు ద్విచక్ర వాహనాలు, రూ.6 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాలాజీ అనే మూడో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.