వైఎస్సార్సీపీ పాలనలో గంజాయి గ్యాంగులు ఫుల్ - చర్యలు నిల్ Ganja Increase In YSRCP Government :అభివృద్ధికి చిరునామాగా ఉండాల్సిన రాష్ట్రం వైఎస్సార్సీపీ పాలనలో గంజాయికి కేంద్రంగా మారింది. పదిహేనేళ్ల ప్రాయం నుంచే యువతకు అలవాటుగా మారుతూ విద్యాసంస్థలను ముంచెత్తుతోంది. ఒకప్పుడు గంజాయి దొరకడమంటే గగనం. కానీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చినంత సులభం. జగన్ ప్రభుత్వ అసమర్థత, చేతకానితనంతో నాలుగున్నరేళ్లగా ఆ వీధి ఈ రోడ్డు అనే తేడా లేకుండా ప్రతి చోటా నిత్యావసర వస్తువులా దొరుకుతోంది.
Ganja Gangs In AP :విశాఖ మన్యం నుంచి ఏటా దాదాపు 10 వేల కోట్ల రూపాయల విలువైన గంజాయి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు దేశ, విదేశాలకు తరలుతోందని అంచనా. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లోకి చేరేసరికి దాని విలువ 25 వేల కోట్లపైనే ఉంటోంది. ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఇంత భారీగా వ్యవస్థీకృత దందా సాగుతుంటే ఉక్కుపాదంతో అణచి వేయాల్సిన జగన్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మొక్కుబడి సమీక్షలు, అమలుకు నోచుకోని ప్రకటనలివ్వటం తప్ప నాలుగున్నరేళ్లగా కఠిన చర్య ఒక్కటంటే ఒక్కటీ చేపట్టలేదు. పాలకుల నిర్లక్ష్య వైఖరితో ఏపీతో పాటు సరిహద్దు రాష్ట్రాలకూ గంజాయి ఇప్పుడు పెనుసవాల్‌గా మారింది.
కంటైనర్ రహస్య అరల్లో 492 కిలోల గంజాయి - దిల్లీ కేంద్రంగా సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు
Marijuana Smugglers in Andhra Pradesh : రాష్ట్రంలో గంజాయి సాగు, నిల్వ, అక్రమ రవాణా కొండంత ఉంటే పట్టుబడేది గోరంత మాత్రమే. కచ్చితమైన సమాచారంతోనో లేదా సాధారణ వాహనాల తనిఖీల్లో భాగంగానో దొరికితేనే దొరికినట్లుంటుంది కానీ సెబ్, పోలీసులు నిఘా పెట్టి, ప్రత్యేక ఆపరేషన్లతో పట్టుకునేది నామమాత్రంగా ఉంటోంది. 2019 నుంచి 2022 మధ్యలో దాదాపు 650 కోట్ల విలువైన 5 లక్షల 33 వేల కిలోల గంజాయి ఏపీలో పట్టుబడింది. విశాఖ మన్యం నుంచి ఏటా లక్షలాది కిలోల గంజాయి సరఫరా అవుతుంటే పోలీసులు పట్టుకునేది రెండు శాతమైనా ఉండటం లేదు. సరకు మన్యం దాటి రాకుండా కట్టడి చేయటంలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. తెలంగాణ పోలీసులు ఏపీలోకి వచ్చి మరీ ఇక్కడ గంజాయి స్మగ్లర్లను పట్టుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది రాష్ట్రానికి సిగ్గుచేటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి
CM Jagan Careless on Marijuana Smugglers : గంజాయి మాఫియా రాష్ట్రాన్ని కబళించేస్తుంటే జగన్ ప్రభుత్వం మాత్రం కొరియర్లపైనే కేసులు పెడుతూ సరిపెడుతోంది. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు అత్యధిక సందర్భాల్లో మన రాష్ట్రంలోనే ఉంటున్నాయి. ఈ నెట్‌వర్క్‌ను ఛేదిస్తేనే మత్తు వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుంది. కానీ, గత నాలుగున్నరేళ్లగా ప్రభుత్వం అటువంటి ప్రయత్నాలేమీ చేయలేదు. గంజాయిని కట్టడి చేయాల్సిన సీఐడీలోని నార్కోటిక్స్ విభాగం చోద్యం చూస్తోంది. నాలుగున్నరేళ్లలో ఒక్కటంటే ఒక్క ముఠానూ పట్టుకోకపోవడం వారి పనితీరుకు అద్దం పడుతోంది.
Cannabis Cases in AP :అధికార పార్టీకి గిట్టని వారు, రాజకీయ ప్రత్యర్థులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే వారిని అక్రమ కేసులతో వేధించటంలో తలమునకలైతే ఇక గంజాయి కట్టడికి సమయమెక్కడిదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి మద్యం అక్రమ రవాణా కాకుండా నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో కేంద్రాలకే గంజాయి సహా ఇతర మాదకద్రవ్యాల కట్టడి బాధ్యతలను అప్పగించారు. ఇసుక అక్రమ రవాణా, నాటుసారా, జూదం, గుట్కా, ఎర్రచందనం స్మగ్లింగ్ నియంత్రణ తదితర బాధ్యతలు కూడా ఈ విభాగమే చూస్తోంది. ఇది పేరుకే తప్ప ప్రత్యేకంగా గంజాయి కట్టడిపై శ్రద్ధ చూపిన దాఖలాలు లేవు.
Ganja Gangs: రాష్ట్రంలో మితిమీరిపోతున్న గంజాయి ముఠాల అరాచకాలు.. ఏమిలేవన్నట్లుగా అధికార యంత్రాంగం..
Police Seize Cannabis in AP :గంజాయిని అరికట్టడం, స్మగ్లర్లను పట్టుకోవటంలో చేతులెత్తేసిన జగన్ సర్కార్ రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపులకు, ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను వేధించేందుకు వారిపై అక్రమంగా గంజాయి కేసులను ప్రయోగిస్తోంది. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిపై విమర్శలు చేసినందుకు గాను ఒంగోలుకు చెందిన సుబ్బారావు గుప్తాపై గంజాయి కేసు బనాయించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నాయకులను పోటీ చేయనివ్వకుండా అడ్డుకునేందుకు పలువురిని మత్తు పదార్థాలకు సంబంధించిన కేసులు పెడతామని బెదిరించారు.
AP Position on Cannabis Use :రాష్ట్రంలో 4 లక్షల 64 వేల మంది గంజాయికి బానిసలయ్యారు. వారిలో 10 నుంచి 17 ఏళ్ల లోపు వారు 21 వేల మంది ఉన్నారు. బాలల్లో గంజాయి వినియోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 12వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో 20 లక్షల 19 వేల మంది మాదకద్రవ్యాల వ్యసనపరులు ఉండగా వారిలో 15.70 శాతం మంది అంటే 3 లక్షల 17 వేల మంది బాలలున్నారు. రాష్ట్రంలో 2019లో 66 వేల 665 కిలోలు, 2020లో లక్షా 6వేల 42 కిలోలు, 2021లో లక్షా 91 వేల 712 కిలోలు, 2022లో లక్షా 69 వేల 201 కిలోలు అంటే నాలుగేళ్లలో మొత్తం 5 లక్షల 33 వేల 620 కిలోల గంజాయిని పట్టుకున్నారు.
Telangana CM Revanth Reddy on Ganja Gangs : గంజాయి సహా అన్ని రకాల మాదకద్రవ్యాల కట్టడి కోసం గతేడాది మే నెలలో తెలంగాణలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరోని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కొద్ది నెలల్లోనే అది మంచి ఫలితాలు ఇచ్చింది. గోవా తదితర రాష్ట్రాలకు వెళ్లి ఆపరేషన్లు నిర్వహించి డ్రగ్స్ ముఠాల సూత్రధారులను అదుపులోకి తీసుకున్నారు. దీన్ని గ్రే హౌండ్స్, ఆక్టోపస్ తరహాలో ప్రత్యేక విభాగంగా తీర్చిదిద్దాలని ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అదనపు డీజీపీ స్థాయి అధికారిని దానికి అధిపతిగా నియమించారు. ఏపీలోనూ గంజాయి కట్టడి కోసం ఇలాంటి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
తాడేపల్లిలో పెట్రేగిపోతున్న గంజాయి ముఠాలు..