తెలుగుదేశం పార్టీ విశాఖ లోక్‌సభ, గాజువాక, భీమిలి శాసనసభ స్ధానాలకు నెలకొన్న ప్రతిష్ఠంభన ఈ రోజు రాత్రి తొలగనుంది. విశాఖలో గంటా శ్రీనివాస్ స్వగృహంలో విశాఖ శాసన సభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాస్, వాసుపల్లి గణేష్‌కుమార్, ఎం.శ్రీభరత్ తదితరులు ఆయనతో సమావేశమయ్యారు. ఈ మూడు స్ధానాలపై అధిష్ఠానం సమాలోచనలో ఉందని, పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రచారం అనంతరం ఈరోజు తుది నిర్ణయం తీసుకోనున్నారని గంటా ప్రకటించారు. తెలుగుదేశం పార్టీలో అభ్యర్థులు ప్రాధాన్యం కాదని, ఆయా స్ధానాల్లో సమీకరణాలను బట్టి గెలుపు అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని అన్నారు. వైకాపాలో సీటు రాక భంగపడ్డ కోలా గురువులు(విశాఖ దక్షిణ), వంశీకృష్ణ యాదవ్ (విశాఖ తూర్పు) ఆదివారం సాయంత్రం తనను కలిశారని తెలిపారు. ఎంతోకాలంగా తాము ఆ పార్టీ కోసం శ్రమించామని, కోట్లాది రూపాయలు ఖర్చు చేశామని వాపోయారన్నారు. పార్టీ అధిష్టానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకొని వెళ్లి వారి అర్హతలకు తగ్గ అవకాశాలు ఇచ్చేవిధంగా కృషి చేస్తామన్నారు.విశాఖ పార్లమెంటు స్థానానికి గీతం విద్యా సంస్థల అధ్యక్షుడు శ్రీ భరత్ ఆసక్తిగా ఉన్న అంశాన్ని చంద్రబాబుకు తెలియజేస్తామన్నారు.