విశాఖ మన్యంలోని చింతపల్లి మండలం తాజంగిలో ఓ గిరిజన కుటుంబం ఎంతో ప్రేమగా ఎలుకలను పెంచుకుంటోంది. కొన్నాళ్ల కిందట ఒడిశా నుంచి వలస వచ్చిన గిరిజన కుటుంబాలు తాజంగిలో నివాసముంటున్నాయి. తాజంగి గ్రామంలో టిక్కితపాడు వీధిలో నివాసముంటున్న కొర్రా మల్లమ్మ సూరిబాబు దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు శ్రీనుబాబు ఇటీవల ఒడిశాలోని జయపురం వెళ్లారు. అక్కడ నుంచి రెండు పెంపుడు ఎలుకలను తీసుకువచ్చాడు.
వింతైన ఎలుకలు... చూసేందుకు పర్యటకుల ఉరకలు - funny rats at visakha manyam
ఇంట్లో ఒక్క ఎలుక ఉందంటే చాలు దాన్ని ఎలా తరిమికొడదాం.. లేక ఏ మందో పెట్టి చంపుతామని చూస్తుంటాం. ఎందుకంటే ఇంట్లో ఫర్నీచర్ దగ్గర నుంచి వేసుకునే బట్టల వరకు అన్నీ నాశనం చేస్తాయి కాబట్టి. కానీ వాళ్లు మాత్రం పెంపుడు జంతువుల్లా రెండు చిట్టెలుకలను పెంచుకుంటున్నారు. అవి చూడ్డానికి ముద్దుగా ఉన్నాయి. మీరు ఓ లుక్కేయండి చిట్టి చిట్టి ఎలుకలవైపు!
ఆడ, మగ ఎలుకలు తెలుపు, నలుపు ఊదారంగుల కలయికతో ఇవి ఆకర్షణీయంగా ఉన్నాయి. కుందేళ్ల మాదిరిగానే ఇల్లంతా కలియదిరుగుతూ సందడి చేస్తున్నాయి. మనుషులతోనూ మచ్చికగా మసులుతున్నాయి. వీటికి ఆహారంగా అన్నం, పాలు, పచ్చిగడ్డి పెడుతున్నట్లు కుటుంబీకులు తెలిపారు. ఇవి ఇంట్లో ఉంటే పాములు, సాధారణ ఎలుకలు బెడద ఉండదని వీరు చెబుతున్నారు. తాజంగికి వచ్చే పర్యటకులు గిరిజన కుటుంబం పెంచుతున్న రంగుల ఎలుకలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఇదీ చూడండి
ఆక్రమణల తొలగింపును నిరసిస్తూ.. ఏడుగురు ఆత్మహత్యాయత్నం